KTR
KTR

Police Notice:తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్న ఘటన సంచలనంగా మారగా, ఈ సందర్బంగా స్పీకరపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదంగా మారిన విషయం తెలిసిందే. అనంతరం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి బహిష్కరించిన ప్రభుత్వం ఆ రోజు అసెంబ్లీ ముందు జరిగిన వివాదానికి సంబంధించి విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ పీఏ, పీఆర్‌ఓకు పోలీసులు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కేటీఆర్ పీఏ మహేందర్‌రెడ్డి, పీఆర్‌ఓ మహేష్‌కు సైఫాబాద్ పోలీసులు ఈ మేరకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ గేట్-3 వద్ద ఈ నెల 7న చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించే పనిలో భాగంగా పోలీసులు ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

నోటీసులో పేర్కొన్న వివరాల మేరకు ఈ రోజు మహేందర్‌రెడ్డి, మహేష్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని పోలీసులు తెలిపారు. అసెంబ్లీ గేట్-3 వద్ద జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆ ఘటన సమయంలో ఏం జరిగింది? అక్కడ ఎవరు ఉన్నారు? ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరించడంలో భాగంగా ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ రోజు విచారణలో పోలీసులు ఏ అంశాలపై ప్రశ్నలు అడగనున్నారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ఈ ఘటనపై బీఆర్‌ఎస్‌ వర్గాలు ప్రభుత్వం పై విమర్శలు ఎక్కుపెట్టారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.