donald Trump

అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీ ఐటీ నిపుణులకు.. ముఖ్యంగా భారతీయ టెక్కీలకు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) నేతృత్వంలోని ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. హెచ్‌1బీ సహా పలు రకాల వీసాలపై ఉన్న ఉద్యోగులకు ఉద్యోగం పోయిన తర్వాత మరొక ఉద్యోగం వెతుక్కోవడానికి ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ వెసులుబాటును ఎత్తివేసేందుకు అమెరికా ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. ఈ మేరకు ‘ఎలిమినేటింగ్ ద డిస్క్రీషనరీ 60-డే గ్రేస్ పీరియడ్’ పేరుతో రూపొందించిన నూతన నిబంధన పత్రాన్ని హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించనుంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. హెచ్‌1బీ వీసాపై పనిచేస్తున్న ఒక విదేశీ ఉద్యోగి తమ ఉద్యోగాన్ని కోల్పోతే ఆ వ్యక్తికి మరొక కొత్త కంపెనీలో ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా తమ వీసా కేటగిరీని మార్చుకోవడానికి 60 రోజుల సమయం లభిస్తుంది. కానీ డీహెచ్‌ఎస్ ప్రతిపాదించిన ఈ కొత్త నిబంధన గనుక పూర్తిస్థాయిలో ఆమోదం పొందితే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఈ ప్రతిపాదన ప్రకారం ఉద్యోగం పోయిన వెంటనే వీసా కాలపరిమితి ఎంత మిగిలి ఉన్నప్పటికీ సదరు విదేశీ ఉద్యోగి తక్షణమే అమెరికాను విడిచిపెట్టి స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుంది. అమెరికాలోనే కొనసాగాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తుగా ప్రత్యేక ఆథరైజేషన్ పొంది ఉంటే తప్ప అక్కడ నివసించడానికి వీలుండదు. ఈ ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం 60 రోజుల వ్యవధిని కేటాయించింది. ఈ కాలంలో వచ్చే వ్యాఖ్యలు, అభిప్రాయాలను సమీక్షించిన అనంతరమే తుది నిర్ణయం తీసుకుంటారు.

Also Read : శత్రువులకు మైండ్ బ్లాక్.. గాల్లోకి ఒకేలాంటి 2 ప్లేన్స్.. రాడార్లకే దొరకని పుతిన్ సీక్రెట్ ఫ్లైట్!

అమెరికా ఐటీ రంగంలో పనిచేస్తున్న విదేశీ నిపుణులలో భారతీయ టెక్ ఉద్యోగుల సంఖ్యే అత్యధికం. ఏటా వేల సంఖ్యలో భారతీయులు హెచ్‌1బీ వీసాల ద్వారా అమెరికా వెళ్తున్నారు. గ్లోబల్ టెక్ కంపెనీలలో లేఆఫ్‌లు లేదా సిబ్బంది తగ్గింపులు జరుగుతున్న సమయంలో ఈ 60 రోజుల గ్రేస్ పీరియడ్ విదేశీ ఉద్యోగులకు ఎంతో ఊరటనిచ్చేది. ఇప్పుడు ఈ వెసులుబాటును రద్దు చేస్తే కొలువు కోల్పోయిన వెంటనే భారతీయులు తమ కుటుంబాలతో సహా రాత్రికి రాత్రే అమెరికాను వదిలి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ ప్రతిపాదిత నిబంధన కేవలం హెచ్‌1బీ వీసాదారులకే కాకుండా అమెరికాలో తాత్కాలికంగా నివసిస్తూ 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ పొందుతున్న E-1, E-2, E-3, H-1B, H-1B1, L-1, O-1 వీసాదారులు, TN నాన్-ఇమ్మిగ్రెంట్లకు కూడా వర్తిస్తుంది. ఈ గ్రేస్ పీరియడ్ నిబంధనను పూర్తిగా ఎత్తివేస్తే ఉద్యోగం కోల్పోయి అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్లుగా భావించే వారికి డీహెచ్‌ఎస్ ‘నోటీసెస్ టూ అప్పియర్’ జారీ చేస్తుంది. ఇది సదరు వ్యక్తులను చట్టబద్ధంగా వారి సొంత దేశాలకు బలవంతంగా తిప్పి పంపించే చట్టపరమైన ప్రక్రియలో మొదటి అడుగుగా మారుతుంది.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనా కాలంలో 2016లో ఈ 60 రోజుల గ్రేస్ పీరియడ్ నిబంధనను తొలిసారిగా అమల్లోకి తెచ్చారు. విదేశీ నిపుణులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారడానికి లేదా ఆకస్మికంగా ఉద్యోగం పోయినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడకుండా కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు ఈ వెసులుబాటు కల్పించారు.

Also Read : మండుటెడారిలో 4 కోట్ల మందికి నీళ్లు.. ఎలాగంటే..?