
Philippines : ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటక ప్రాంతానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఫెర్రీలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందగా.. మరో 87 మంది ఆచూకీ తెలియడం లేదని ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ గురువారం వెల్లడించింది. పలావాన్ ప్రావిన్స్‌లోని పర్యాటక ప్రాంతానికి సమీపంలో ఎంవీ జూన్ ఆస్టర్ అనే ఫెర్రీలో బుధవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. తీరానికి సుమారు 2.2 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత ఐదుగురి మృతదేహాలను ఒడ్డుకు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.
Also Read : తిరుమలలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు – ఎందుకో తెలుసా?
కోస్ట్ గార్డ్ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో ఫెర్రీ మొత్తం మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు కనిపించాయి. ప్రమాద సమయంలో ఫెర్రీలో మొత్తం 134 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం తర్వాత 42 మందిని రక్షించినట్లు కోస్ట్ గార్డ్ కెప్టెన్ నోమీ కయాబ్యాబ్ తెలిపారు. వీరిలో 38 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. అయితే మిగిలిన 87 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నందున ఈ సంఖ్యల్లో మార్పు ఉండొచ్చని అధికారులు చెప్పారు.
రక్షించిన వారితో ఇంకా పూర్తిస్థాయిలో మాట్లాడలేకపోయామని అధికారులు తెలిపారు. ఫెర్రీలో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకురావడంతో పాటు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు, మెరైన్ ట్రాఫిక్ ట్రాకింగ్ సమాచారం ప్రకారం జూన్ ఆస్టర్ ఫెర్రీ మనీలా నుంచి బయలుదేరినట్లు తెలిసింది. ప్రమాదానికి గల కారణాలు, గల్లంతైన వారి పరిస్థితిపై అధికారులు ఇంకా వివరాలు వెల్లడించలేదు.
Also Read : ఏపీ రాజకీయాల్లో సంచలనం.. కొత్తపార్టీపై విజయసాయిరెడ్డి క్లారిటీ









