
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా? అంటే అవుననే అంటున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆయన ఈ రోజు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చారు. రాష్ర్టంలో ప్రజా సమస్యలపై పోరాడేందుకు కొత్త రాజకీయ పార్టీ అవసరమని, తాను కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. గత 15 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రధానంగా టీడీపీ, వైసీపీ చుట్టూనే తిరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ రెండు పార్టీల మధ్య ప్రజలు నలిగిపోతున్నారన్నారు. ఈ రెండు పార్టీలు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. టీడీపీని ‘రెడ్ బుక్ పార్టీ’గా, వైసీపీని రప్పా రప్పా పార్టీగా అభివర్ణించిన ఆయనఅలాంటి పార్టీలు కాకుండా ప్రజా సమస్యలను ప్రధాన అజెండాగా చేసుకుని పోరాడే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రాష్ట్రానికి అవసరమని విజయసాయిరెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీలపై విజయసాయిరెడ్డి దుమ్మెత్తిపోశారు. ఆ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్‌కు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. అధికార పార్టీకి పోలీసులు అనుకూలంగా వ్యవహరించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాన్ని ఎల్లప్పుడూ కమ్మ, రెడ్డి రెండు కులాలే పాలించాలా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఇక తాను స్థాపించబోయే కొత్త పార్టీలో తాను CM Candidate కాదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీలో సమర్థత కలిగిన ఎవరైనా సీఎం కాగలరన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే వహించిన తరహా మెంటార్ పాత్రను తాను పోషిస్తానని విజయసాయి వెల్లడించారు. అదే సమయంలో తాను రాజధాని అమరావతికి వ్యతిరేకం కాదన్నారు. ఇంత ఖర్చు పెట్టాక వేరే రాజధాని అనడం కుదరదని పేర్కొన్నారు. తన పార్టీలో జెన్ జీ కి పెద్ద పీట వేస్తామని, వారికే 66 శాతం సీట్లు కేటాయిస్తామని తేల్చి చెప్పారు. తమ పార్టీలో అర్హులైన వారికే పెద్దపీట వేస్తామని, తాను వెనుక ఉండి సలహాలు ఇస్తానే తప్ప నేరుగా ఎలాంటి పదవి చేపట్టనని స్పష్టం చేశారు. దేశభక్తి ఉన్నవారికే కొత్త పార్టీలో పెద్దపీట వేస్తామన్నారు.
గత ఏడాది ఒక పుస్తకం రాసా. రెడ్డి సామాజిక వర్గం ఎలా ఉద్భవించింది. కాపుల నుంచి ఎలా వేరు పడ్డారు అనే అంశాలు అందులో పేర్కొంటా. త్వరలో ఆ బుక్ విడుదల చేస్తానన్నారు. రాష్ట్రంలో పార్టీ విధానాలను వివరించేందుకు అనంతపురం, తిరుపతి, విశాఖపట్నంలో మరో మూడు మీడియా సమావేశాలు నిర్వహిస్తానని వెల్లడించారు. ఒక్కో సమావేశంలో ఐదు కీలక అంశాలను ప్రకటిస్తామన్నారు. ఆ అంశాలన్నింటినీ కలిపి ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరుస్తామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.. ఏపీలో ఆదాయం కంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయని ఆరోపించారు. ఆ ధరలను ఎలా తగ్గించాలనే దానిపై తమ పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెడుతుందన్నారు. ఎంత ఇష్టం ఉన్నా లేకున్నా అమరావతిని రాజధానిగా గుర్తించి తీరాల్సిందేననన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.








