
Singapore : ప్రపంచంలోనే అత్యధిక జీతం తీసుకునే ప్రధానమంత్రిగా ఉన్న సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ నిలిచారు. సింగపూర్ ప్రభుత్వం ప్రధానితో పాటు మంత్రులు, ఇతర కీలక రాజకీయ నేతల జీతాలను భారీగా పెంచాలని నిర్ణయించింది. దీంతో ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్న వారి జీతాలు మరింత పెరగనున్నాయి.
సింగపూర్ పార్లమెంటులో మంగళవారం ప్రధాని లారెన్స్ వాంగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం తనకు ఏడాదికి సింగపూర్ డాలర్లు 22 లక్షలు అంటే సుమారు 17 లక్షల అమెరికన్ డాలర్లు జీతంగా వస్తోందని చెప్పారు. అయితే ఈ జీతం పెంపుతో వచ్చే మొత్తం అదనపు డబ్బును తాను ప్రధానిగా ఉన్న కాలంలో మంచి పనులకు విరాళంగా ఇస్తానని లారెన్స్ వాంగ్ తెలిపారు.
సింగపూర్ డిప్యూటీ ప్రధాని జీతం కూడా భారీగా పెరగనుంది. ప్రస్తుతం ఏడాదికి సింగపూర్ డాలర్లు 18.7 లక్షలు ఉండగా.. ఇకపై 30.6 లక్షలకు పెరగనుంది. కేబినెట్ మంత్రులకు వారి పదవి, బాధ్యతలను బట్టి ఏడాదికి 18 లక్షల నుంచి 28.8 లక్షల సింగపూర్ డాలర్ల వరకు జీతం అందనుంది.
Also Read : మట్టిలో కలిసిపోయిన మక్కా ఒప్పందం.. భయపడి పారిపోయిన పాకిస్థాన్!
సింగపూర్‌లో మంత్రులు, రాజకీయ నేతల జీతాలను చివరిసారిగా 15 ఏళ్ల క్రితం మార్చారు. ఇప్పుడు స్వతంత్ర కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా ఈ పెంపును తీసుకొచ్చినట్లు ప్రధాని వాంగ్ తెలిపారు. అయితే కొత్త జీతాలు వెంటనే పూర్తిగా అమల్లోకి రావు. ప్రస్తుతం పదవుల్లో ఉన్న నేతలకు అక్టోబర్ 15 నుంచి వారి పరిస్థితి, పనితీరును బట్టి 9 శాతం వరకు ఒకేసారి జీతం పెంపు ఇవ్వనున్నారు. ఆ తర్వాత జీతాల్లో మార్పులు వారి పనితీరు, బాధ్యతలను బట్టి ఉంటాయని వాంగ్ తెలిపారు.
సింగపూర్ ప్రభుత్వం రాజకీయ నేతలకు భారీ జీతాలు ఇవ్వడానికి ఓ కారణం చెబుతోంది. ప్రతిభ ఉన్నవారిని రాజకీయాల్లోకి తీసుకురావడంతో పాటు.. దేశానికి మంచి పాలన అందించేందుకు ఈ జీతాలు అవసరమని ప్రభుత్వం అంటోంది. అయితే సాధారణ ప్రజల ఆదాయంతో పోలిస్తే మంత్రుల జీతాలు చాలా ఎక్కువగా ఉండటంతో ఈ అంశంపై సింగపూర్‌లో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. జీతాల అంశం చాలా సున్నితమైన విషయమని ప్రధాని వాంగ్ కూడా అంగీకరించారు.
అయితే దేశానికి మంచి పాలన అందాలంటే మంచి నాయకత్వం అవసరమని, రాబోయే దశాబ్దాల్లో కూడా సింగపూర్‌కు సమర్థవంతమైన నాయకత్వం ఉండాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ప్రపంచంలో అవినీతి తక్కువగా ఉన్న దేశాల్లో సింగపూర్‌కు తరచూ చోటు దక్కుతుండటం కూడా గమనార్హం.
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ జీతం పెంపు తర్వాత ఆయన ఏడాది వేతనం సుమారు రూ.26.9 కోట్లకు చేరనుంది. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏడాది జీతం రూ.3.5 కోట్ల కంటే దాదాపు 7 రెట్లు ఎక్కువ. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏడాది జీతం సుమారు రూ.20 లక్షలు కాగా, వాంగ్ జీతం మోదీ వేతనం కంటే దాదాపు 135 రెట్లు ఎక్కువ.
Also Read : ఇరాన్ ట్యాంకర్లపై అమెరికా దాడి.. బిగ్ షాకిచ్చిన ఇరాన్!









