
US Midterm Elections 2026 : అమెరికాలో మరో రెండు నెలల్లో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో భారతీయ-అమెరికన్ ఓటర్లు ట్రంప్ నకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఓటర్లు ప్రస్తుత అధికార రిపబ్లికన్ పార్టీ కంటే డెమోక్రటిక్ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఏషియన్ అండ్ పసిఫిక్ ఐలాండర్ అమెరికన్ ఓట్ (APIAVote) నిర్వహించిన తాజా జాతీయస్థాయి సర్వేలో ఈ విషయం వెల్లడి కావడం సంచలనంగా మారింది. అమెరికాలోని 435 కాంగ్రెస్, 35సెనెట్ సీట్లకు, అలాగే పలు స్థానిక సంస్థలకు నవంబర్ 3న మధ్యంతర ఎన్నికలు జరగనుండగా తాజా సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఎన్నికలకు మరో రెండు నెలల సమయం ఉండటంతో రెండు రాజకీయ పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. అయినప్పటికీ.. ఏషియన్ అమెరికన్, పసిఫిక్ ఐలాండర్ (AAPI) నమోదిత ఓటర్లలో 90 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తిగా ఉన్నారని సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా భారతీయ అమెరికన్లలో అధిక శాతం మంది డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు ఈ సర్వేలో వెలుగులోకి రావడం గమనార్హం.
Also Read : ఇరాన్‌పై గెలిస్తే పెట్రోల్ ధరలు భారీగా తగ్గుతాయ్: ట్రంప్ సంచలన ప్రకటన!
కాగా, మిడ్ టర్మ్ ఎన్నికల్లో ఇండియన్-అమెరికన్ ఓటర్లలో 66 శాతం మంది ఓటర్లు డెమోక్రటిక్ అభ్యర్థులకే ఓటువేయాలని నిర్ణయించు కున్నట్లు సర్వే స్పష్టం చేసింది. మరోవైపు.. ఈ ఎన్నికల్లో 18 శాతం మంది ఇండియన్ అమెరికన్లు మాత్రం రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ పార్టీ సెనెట్ అభ్యర్థులకు 22 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. మరోవైపు అమెరికాలో ఆసియా సంతతి అమెరికన్ల ఓట్ల శాతం పెరుగుతున్న నేపథ్యంలో వారి అభిప్రాయాలు కీలకంగా మారాయని పరిశీలకులు అంటున్నారు. కాగా, జీవనవ్యయాలు, ద్రవ్యోల్బ ణమే తమ ఓటింగ్ తీరుతెన్నులను అధికంగా ప్రభావితం చేస్తాయని ఆసియా సంతతికి చెందిన ఓటర్లు ఈ సర్వేలో అభిప్రాయ పడ్డారు. ఈ ఎన్నికల్లో 16 మిలియన్ల మంది ఆసియా దేశాల సంతతి వారు, పసిఫిక్ ఐల్యాండర్లు ఓటేసే అవకాశం ఉందని సర్వే సంస్థ పేర్కొంది.
అమెరికా లో ఆసియా అమెరికన్ల ఓటర్ల సంఖ్యలో వేగవంతమైన వృద్ధి ఉందని ఏఏపీఐ డేటా వ్యవస్థాకుడు కార్తిక్ రామకృష్ణన్ వెల్లడించారు. కాగా ఏషియన్ అండ్ పసిఫిక్ ఐలాండర్ అమెరికన్ ఓట్ (APIAVote) నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 2,066 మంది నమోదిత ఓటర్లు పాల్గొన్నారు. వారిలో 1,896 మంది ఆసియా అమెరికన్లు ఉన్నారు.. 242 మంది ఇండియన్ అమెరికన్లతో పాటు 170 మంది పసిఫిక్ ఐలాండర్లు పాల్గొన్నట్లు సర్వే సంస్థ వెల్లడించింది. 2026లో నిర్వహించే మధ్యంతర ఎన్నికల్లో కోటీ 60 లక్షల మంది ఆసియా అమెరికన్, పసిఫిక్ ఐలాండర్ ఓటర్లు ఓటు వేయడానికి అర్హులని ఏఏపీఐ డేటా స్పష్టం చేసింది.
Also Read : హిందూ గ్రూప్ విజిట్.. ఈఫిల్ టవర్ మూసివేత!









