TSLPRB : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి నోటీఫికేషన్‌ వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం పలువురు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థుల కోసం పోలీసు నియామక మండలి గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రస్తుత నిర్ణయం ప్రకారం సెప్టెంబర్‌ 16 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు పోలీసు నియామక మండలి వివరించింది. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 7,437 పోస్టుల కోసం జూలై 29న ప్రభుత్వం 4 నోటిఫికేషన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సెప్టెంబర్ 9వ తేది వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. 9వ తేదీతో గడువు ముగియనుండగా.. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఈ గడువును మరో వారంరోజులపాటు పొడిగిస్తున్నట్లు పోలీసు నియామక మండలి ప్రకటించింది.

Also Read : ఐఏఎస్‌ పీఎస్‌కు అస్వస్థత.. సీపీఆర్‌ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి..కానీ..

కాగా, తెలంగాణలో పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) 7,437 పోస్టులను భర్తీ చేసేందుకు జులై 29న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌ సివిల్‌(3,697) ఏఆర్‌(1,052), పోలీస్‌ కానిస్టేబుల్‌ (ఎస్‌ఏఆర్‌ పీపీఎల్‌ మెన్‌) 24, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కానిస్టేబుల్‌(1,380), ఫైర్‌ ఫైటర్‌(751), జైలు వార్డర్‌(208) తదితర పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఉద్యోగాలలో కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, వార్డర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఎస్సై, డిప్యూటీ జైలర్ పోస్టులకు అప్లై చేసుకునేవారు ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి. టెక్నికల్ పోస్టులకు టెన్త్, ఐటీఐ తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని నియామక మండలి తెలిపింది. ప్రిలిమినరీ పరీక్ష, శరీర దారుఢ్యం, రాత పరీక్షల ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తామని వెళ్లడించింది.

కాగా నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచి ఇప్పటివరకు 3,38,336 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా.. 2,88,530 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్దంగా ఉన్నారని టీఎస్‌ఎల్‌ఆర్‌బీ తెలిపింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆధార్ వెరిఫికేషన్‌ కూడా 95 శాతానికి పైగా పూర్తయినట్లు తెలిపింది. అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకూడదని, అలా చేస్తే సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నియామక మండలి తెలిపింది. అభ్యర్థులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది.

Also Read : స్పీకర్‌పై కామెంట్స్.. BRS MLC తాతా మధు అరెస్ట్!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.