
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 8న గుజరాత్‌లోని వడోదరలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు ఓ ఆసక్తికరమైన కార్యక్రమం కూడా జరగనుంది. తొలిసారిగా ప్రధాని పాల్గొనే ఓ పబ్లిక్ ఈవెంట్‌కు ప్రజలు బుక్‌మైషో ద్వారా ఉచితంగా రిజిస్టర్ చేసుకునే అవకాశం కల్పించారు. వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఈ కార్యక్రమం కోసం ప్రైవేట్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోను ఉపయోగించింది.
నమో ఫర్ వికసిత్ భారత్ పేరుతో ఈ కార్యక్రమం మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ పావిలియన్‌లో జరగనుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉద్యోగులు, టీచర్లు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, పౌర సంఘాల ప్రతినిధులతో పాటు సాధారణ ప్రజలు కూడా పాల్గొననున్నారు.
రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన వెంటనే ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. అందుబాటులో ఉన్న సీట్లన్నీ కేవలం గంటలోనే బుక్ అయిపోయాయి. మరో 42 వేల మందికి పైగా రిజిస్టర్ చేసుకునేందుకు ప్రయత్నించడంతో వారిని వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్లు కూడా నిలిపివేశారు. ఈ కార్యక్రమానికి ఎంట్రీ కూడా పూర్తిగా డిజిటల్ విధానంలోనే ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న వారికి బుక్‌మైషో అకౌంట్ ద్వారా ఈ-ఎంట్రీ టికెట్ వస్తుంది. అందులో ఉండే లైవ్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కార్యక్రమంలోకి అనుమతిస్తారు.
Also Read : శాంసంగ్ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఉద్యోగులపై వేటు!
మోదీ వడోదరలో మధ్యాహ్నం సమయంలో రూ.35 వేల కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. కొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతో పాటు మరికొన్ని పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనలో రైల్వే ప్రాజెక్టులకు పెద్దపీట వేశారు. వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లో మొత్తం 326 కిలోమీటర్ల పొడవైన మూడు భాగాలను మోదీ జాతికి అంకితం చేయనున్నారు. దీంతో ఈ ఫ్రైట్ కారిడార్ మొత్తం అందుబాటులోకి రానుంది.
రూ.20,700 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన ఈ రైల్వే మార్గాల వల్ల ఉత్తర భారతదేశం నుంచి ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్‌కు సరుకు రవాణా మరింత సులభం కానుంది. సరుకులు త్వరగా చేరడంతో పాటు రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న రైల్వే మార్గాలపై ఒత్తిడి కూడా తగ్గనుంది. కొత్త సనంద్, కొత్త మకర్‌పురా, కొత్త ఉంబర్‌గావ్, కొత్త జేఎన్‌పీటీ నుంచి సరుకు రవాణా రైళ్లను కూడా మోదీ ప్రారంభించనున్నారు.
అలాగే వడోదర నుంచి తాండా రోడ్‌కు కొత్త ప్యాసింజర్ రైలును కూడా ప్రారంభిస్తారు. అలీరాజ్‌పూర్‌లోని మారుమూల, గిరిజన ప్రాంతాలను రైల్వే నెట్‌వర్క్‌తో కలిపేందుకు నిర్మించిన జోబట్-తాండా రోడ్ రైల్వే లైన్‌ను కూడా మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఇక 329 కిలోమీటర్ల పొడవైన మరో మూడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటి కోసం రూ.9,700 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారు. దాదాపు రూ.1,780 కోట్ల విలువైన మూడు హైవే ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు.
Also Read : ఇంజిన్‌లో సమస్య.. మలేషియా విమానానికి తప్పిన పెను ప్రమాదం









