
Thatha Madhu Arrest : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. మంగళవారం ఉదయం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని తాతా మధు ఇంటికి పోలీసులు వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తాజా సమాచారం.
తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు అయింది. సోమవారం అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ నేతలు చేపట్టిన నిరసన సమయంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. అదే సమయంలో తాతా మధు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు స్పీకర్‌ను అవమానించడమే కాకుండా తెలంగాణ ప్రజలను అవమానించినట్లేనని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు.
Also Read : తెలంగాణ అసెంబ్లీలో మళ్లీ రగడ.. స్పీకర్ vs హరీశ్ రావు!
అయితే తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని తాతా మధు ఇప్పటికే స్పష్టం చేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహంలో తాను మాట్లాడానని, తన మాటలను వక్రీకరించి స్పీకర్‌కు ఆపాదిస్తున్నారని చెప్పారు. ఒకవేళ తన మాటలు స్పీకర్‌ను ఉద్దేశించినవిగా భావిస్తే వాటిని ఉపసంహరించుకుంటున్నానని, విచారం వ్యక్తం చేస్తున్నానని కూడా తెలిపారు.
మరోవైపు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాత్రం తాతా మధు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. తనను వ్యక్తిగతంగా బాధపెట్టడంతో పాటు స్పీకర్ పదవి గౌరవాన్ని దెబ్బతీశారని అన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని కూడా ప్రకటించారు.
తాజాగా మంగళవారం ఉదయం తాతా మధు ఇంటికి పోలీసులు చేరుకున్న సమయంలో కొంతసేపు హైడ్రామా నెలకొంది. పోలీసులు బయటకు రావాలని కోరినా ఆయన తొలుత నిరాకరించినట్లు సమాచారం. అనంతరం ఉన్నతాధికారులు ఆయనతో మాట్లాడి అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు అక్కడికి చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తాతా మధును ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. దీంతో కోర్టులో ఏం జరుగుతుంది? పోలీసుల తదుపరి చర్యలు ఏంటి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read : భారీగా డబ్బులు వసూలు .. యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందన అరెస్ట్!









