Malaysia Airlines : ఇటీవల రోడ్డు మీద ప్రయాణించే వాహనాల్లాగే ఆకాశంలో ప్రయాణించే విమానాల్లోనూ తరుచుగా సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో విమానం ఎక్కిన ప్రయాణీకులు గమ్యం చేరేదాకా నమ్మకం లేని పరిస్థితి నెలకొంటుంది.

తాజాగా ఈ రోజు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ అనూహ్య సంఘటన కలకలం రేపింది. కౌలాలంపూర్ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా వెళ్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం (MH156)లో ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో చెన్నై ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఎయిర్‌బస్ A330-200 రకానికి చెందిన ఈ విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 186 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

సాంకేతిక సమస్యతో చెన్నై విమానశ్రయంలో దిగడంతోనే విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సి వచ్చింది. దీంతో షెడ్యూల్ ప్రకారం సోమవారం సాయంత్రం 4.40 గంటలకు చేరుకోవాల్సిన ఈ విమానం, కొద్ది నిమిషాల ఆలస్యంగా 4.44 గంటలకు సురక్షితంగా రన్‌వేపై దింపారు. ఈ సందర్భంగా ఎలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో విమానం సురక్షితంగా కిందకు దిగింది. అనంతరం ఇంజిన్ లోని సమస్యను పరిష్కరించిన తర్వాత తిరిగి బయలుదేరింది. ఈ ఘటనపై చెన్నై ఎయిర్‌పోర్టు సీనియర్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది చాలా సున్నితమైన విషయమైనప్పటికీ పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ల్యాండింగ్ సాఫీగా జరిగిందని తెలిపారు. విమానంలో ఉన్న ప్రయాణికులందరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారు’ అని వెల్లడించారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.