
Rain Alert : తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రెండు నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం తమిళనాడు తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై సగటు సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఒక బలమైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడు దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా రాబోయే 48 గంటల్లో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చాలా చల్లగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
Also Read : ఈ పనీరు తిన్నారంటే అంతే సంగతులు.. పైకి పోవడం గ్యారంటీ..
ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 నుంచి 31 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22 నుంచి 23 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఆకస్మికంగా పడే వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రమాదం ఉండటంతో పాటు రహదారులపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వాహనదారులు, ప్రయాణికులు ముందస్తు జాగ్రత్తలతో తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, యానాం పరిసర ప్రాంతాల్లో విస్తారంగా మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. అలాగే కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read : మంత్రిని కాదు కాంగ్రెస్ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేయాలి…









