
Former Minister KTR : రాష్ట్రం లో ఒక మంత్రిని బర్తరఫ్ చేయడం కాదని, ఉద్యోగాలిస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల మోసాలపై బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఆందోళన కార్య క్రమాల్లో భాగంగా కరీంనగర్‌లోని డా.బి.ఆర్ అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన యువ సమరభేరీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. యువతకు స్కిల్ లేదంటున్న రేవంత్ రెడ్డి.. ఓటుకు నోటు దొంగ అంటూ ఘాటుగా విమర్శించారు. రేవంత్ లక్కీ లాటరీ తగిలి ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీనే గడగడలాడించిన యువతకు రేవంత్ ఓ లెక్క కాదన్నారు.
తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం తెలంగాణ యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద పెద్ద మాటలు చెప్పారని కేటీఆర్ విమర్శించారు. ఆ మాటలు.. ఇప్పుడేమయ్యారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జాబులు లేవని.. నోటిఫికేషన్లు లేవని లూటిఫికేషన్లు మాత్రం బ్రహ్మండంగా నడుస్తున్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి వస్తే వందరోజుల్లో పనులు చేస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చక వెయ్యిరోజులు అవుతోందని అన్నారు.
Also Read : మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్.. క్యాబినెట్ నుంచి బర్త్‌రఫ్!
ప్రభుత్వం నడపడం చేతకాక కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారని.. తెలంగాణ తెచ్చిన కేటీఆర్ రాజీనామా చేయాలా? అని ఆయన ప్రశ్నించారు.420 హామీలు నేరవేర్చని రేవంత్ రెడ్డి 420 సార్లు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగులను కాంగ్రెస్ నిండా ముంచిందన్న కేటీఆర్ ఈ ప్రభుత్వ పాలనలో విజన్ లేదని అంతా విధ్వంసమే అని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌తో పెట్టుకోవద్దని కేటీఆర్ హెచ్చరించారు.
ప్రభుత్వాన్ని కమీషన్ల మయం చేశారని, కమీషన్ల కోసం మంత్రులు కొట్టుకుంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తామని అడ్డగోలు హామీలు ఇచ్చిన రాహుల్ ఎందుకు హైదరాబాద్‌కు రావడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగాలపై కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరూ ఒక్కో మాట చెబుతున్నారన్నారు. 1000 రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చింది 16 వేల ఉద్యోగాలే అని కేటీఆర్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో 2.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు.. ఉద్యోగాల కల్పనపై చర్చకు కాంగ్రెస్ సిద్ధమా అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు.
Also Read : నిర్మల్ జిల్లాలో విషాదం… బాసర బ్రిడ్జిపై నుంచి పడి యువకుడి మృతి..








