
Polygraph Test : అమెరికా మిలిటరీలో కీలక సమాచారం బయటకు వెళ్తుండటంపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో అమెరికా జాయింట్ స్టాఫ్‌లో పనిచేస్తున్న సుమారు 50 మంది మిలిటరీ అధికారులు, సివిలియన్ ఉద్యోగులకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించింది. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం కారణంగా అమెరికా వద్ద కీలక ఆయుధాల నిల్వలు తగ్గుతున్నాయన్న సమాచారం మీడియాకు ఎలా చేరిందన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా లాంగ్ రేంజ్ మిసైల్స్, పేట్రియాట్ ఇంటర్సెప్టర్ల కొరతపై వచ్చిన వార్తలు అమెరికా ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసినట్లు తెలుస్తోంది.
ఆగస్టులో నిర్వహించిన పాలిగ్రాఫ్ పరీక్షల్లో అధికారులు, ఉద్యోగులను కొన్ని కీలక ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. క్లాసిఫైడ్ సమాచారాన్ని మీడియాకు చెప్పారా అమెరికా ఆయుధాల నిల్వలు తగ్గుతున్న విషయం బయటకు చెప్పారా? అనే అంశాలపై వారిని ప్రశ్నించినట్లు అధికారులు వెల్లడించారు. అమెరికా జాయింట్ స్టాఫ్‌లో దాదాపు 1,500 నుంచి 2,000 మంది అధికారులు, ఉద్యోగులు పనిచేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా సైనిక కమాండర్లతో కలిసి ఆపరేషన్లు, విధానాలు, యుద్ధ ప్రణాళికలను సమన్వయం చేయడం వీరి ప్రధాన బాధ్యత.
Also Read : నేపాల్ ప్లడ్స్ : 275 మంది ఇండియన్స్ మిస్సింగ్, 1,295 మంది మృతి!
అయితే ఒకేసారి 50 మందికి ఇలాంటి పరీక్షలు నిర్వహించడం అమెరికా మిలిటరీలో చాలా అరుదైన విషయంగా చెబుతున్నారు. ఆధునిక కాలంలో ఇంత పెద్ద స్థాయిలో, ఇంత సీనియర్ స్థాయి సిబ్బందికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించడం తాను ఎప్పుడూ చూడలేదని రిటైర్డ్ నేవీ అధికారి డొనాల్డ్ జే. గ్యూటర్ వ్యాఖ్యానించారు. మరోవైపు, ఈ చర్య కేవలం లీకులకు పాల్పడిన వారిని గుర్తించేందుకే కాకుండా.. భవిష్యత్తులో ఎవరూ రహస్య సమాచారాన్ని బయటకు చెప్పకుండా భయపెట్టే ప్రయత్నంగా కూడా కనిపిస్తోంది.
ఈ వ్యవహారంపై పెంటగాన్ అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ స్పందిస్తూ.. అంతర్గత సిబ్బంది, దర్యాప్తు అంశాలపై తాము వ్యాఖ్యానించబోమని చెప్పారు. అయితే జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారం లీక్ కావడాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటుందని, దానిపై దర్యాప్తు చేస్తుందని తెలిపారు.
ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రహస్య సమాచారాన్ని లీక్ చేస్తున్న వారిని కఠినంగా గుర్తించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఇరాన్ యుద్ధాన్ని అమెరికా ఎలా నిర్వహిస్తోందన్న దానిపై వస్తున్న విమర్శనాత్మక వార్తలపై ట్రంప్ గతంలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read : పీట్ హెగ్సెత్ పెట్టిన చిచ్చు..పెంటగాన్ లో అసలేం జరుగుతోంది?









