
Nepal Floods : నేపాల్–టిబెట్ సరిహద్దులో ఆగస్టు 26న సంభవించిన భారీ వరదలు, బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కనీసం 275 మంది ఇండియన్స్ ఇప్పటికీ గల్లంతయ్యారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. మరో 166 మందిని రక్షించినట్లు వెల్లడించింది. చైనా నుంచి ఇప్పటివరకు 1,907 మంది భారతీయులు సురక్షితంగా నేపాల్‌కు చేరుకున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఘటన తర్వాత నేపాల్‌కు భారత్ పెద్ద ఎత్తున సాయం అందిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 95 టన్నుల సహాయ సామగ్రిని నేపాల్‌కు పంపినట్లు పేర్కొంది.
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. 275 మంది భారతీయులు ఇంకా కనిపించడం లేదని, వారి పరిస్థితిపై నేపాల్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. అయితే చైనా అధికారుల సమాచారం ప్రకారం టిబెట్ అటానమస్ రీజియన్‌లో భారతీయ ప్రయాణికులు ఎవరూ చిక్కుకోలేదని స్పష్టం చేశారు.
Also Read : లీక్ దొంగలెవరు ..? మిలిటరీ అధికారులకు ట్రంప్ లైడిటెక్టర్ పరీక్షలు!
మరోవైపు ఈ భారీ విపత్తులో మృతుల సంఖ్య 1,295కి చేరింది. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు మరిన్ని మృతదేహాలను వెలికితీస్తుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు 12 వేలకు పైగా మందిని రక్షించగా, సుమారు 5 వేల మంది ఇంకా గల్లంతైనట్లు నేపాల్ అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
నేపాల్‌కు భారత్ మరింత సాయం అందించేందుకు సిద్ధంగా ఉందని జైస్వాల్ తెలిపారు. నేపాల్ ప్రభుత్వం కోరిన మేరకు ఫోరెన్సిక్ కిట్లు, బైలీ బ్రిడ్జిలు, ఇతర అవసరమైన సామగ్రిని పంపనున్నట్లు చెప్పారు.
ఇప్పటికే సహాయక, రక్షణ చర్యలకు భారత్ 54 మంది సిబ్బందిని పంపింది. ఇందులో 30 మంది టన్నెల్ రెస్క్యూ నిపుణులు, 19 మంది ఫోరెన్సిక్ నిపుణులు, ఐదుగురు సభ్యులతో కూడిన వైద్య బృందం ఉంది. ఈ బృందాలు ప్రస్తుతం ఘటనాస్థలంలోనే పనిచేస్తూ నేపాల్ అధికారులతో కలిసి సహాయక, రక్షణ చర్యలు చేపడుతున్నాయని విదేశాంగ శాఖ వెల్లడించింది.
Also Read : నేపాల్‌లో విరిగిపడిన కొండచరియలు.. మళ్లీ వరద ముప్పు









