
Konda Surekha : మంత్రి పదవి నుంచి తనను బర్తరఫ్ చేయడంపై కొండా సురేఖ మరోసారి తీవ్రంగా స్పందించారు. తనను అడగకుండానే బర్తరఫ్ చేశారని ఆమె ఆరోపించారు. తనను రాజీనామా చేయమని ఎవరూ అడగలేదని స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, రెండున్నరేళ్లు మంత్రిగా తన పని సమర్థంగా చేశానని చెప్పారు. తన వల్ల ముగ్గురు బీసీ మహిళలకు పదవులు వచ్చాయని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ముగ్గురు మహిళలకు పదవులు ఇచ్చారు.. కంగ్రాట్స్. నా వల్ల ముగ్గురు బీసీ మహిళలకు పదవులు రావడం సంతోషంగా ఉంది అని అన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి టీడీపీ నుంచి వచ్చారని, అందుకే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని కొండా సురేఖ విమర్శించారు. వేం నరేందర్‌రెడ్డి లాంటి వారితో మైండ్‌గేమ్ ఆడిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ రక్తం ఉన్నవాళ్లు ఇలాంటివే చేస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను కావాలనే మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని సురేఖ అన్నారు. తనను టార్గెట్ చేసి చిన్నారెడ్డిని కూడా బలి చేయడం సరికాదన్నారు. చిన్నారెడ్డిపై తీసుకున్న చర్య సరైంది కాదని చెప్పారు.
Also Read : నా బర్తరఫ్ చెల్లదు.. నన్ను బలి చేశారు: కొండా సురేఖ సంచలనం!
తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై కూడా కొండా సురేఖ స్పందించారు. నా కూతురు ఒక మాట అంటే నేనెందుకు ఖండించాలి సుస్మిత వ్యక్తిగత అభిప్రాయాలతో నాకేం సంబంధం? అని ప్రశ్నించారు. సుస్మిత అభిప్రాయాలను తప్పుపట్టే అధికారం తమకు లేదన్నారు. బయట చాలా మంది తనను విమర్శిస్తున్నారని.. మరి వాళ్లు మాట్లాడిన ప్రతిసారీ వారి కుటుంబ సభ్యులను బాధ్యులను చేస్తున్నారా అని ప్రశ్నించారు. నా బిడ్డ ఏదో అన్నదని నన్ను టార్గెట్ చేస్తారా? అని నిలదీశారు.
తనకు మంత్రి పదవిపై ఎలాంటి వ్యామోహం లేదని సురేఖ చెప్పారు. రెండున్నరేళ్లు మంత్రిగా తన బాధ్యతలను సమర్థంగా నిర్వహించానన్నారు. తన పేషీకి వచ్చిన ప్రతి పనిని న్యాయంగా పూర్తి చేశానని చెప్పారు. నేను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సురేఖ తెలిపారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటానన్నారు. కాంగ్రెస్‌లోనే కొనసాగాలా? లేదా? అనే విషయాన్ని కూడా ఇంకా ఆలోచించలేదని చెప్పారు. తనను విమర్శించిన వారిపై కూడా కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను అన్నవాళ్లకు ఉరుసు తగులుతుందని అన్నారు.
Also Read : నిర్మల్ జిల్లాలో విషాదం… బాసర బ్రిడ్జిపై నుంచి పడి యువకుడి మృతి..









