US : అమెరికాలో మంచి ఉద్యోగం, ఆరు అంకెల జీతం.. చేతిలో H-1B వీసా. అయినప్పటికీ ఓ భారతీయ యువతి అమెరికాను వదిలి భారత్‌కు తిరిగి వచ్చింది. కుటుంబానికి దగ్గరగా ఉండాలనే కారణంతో పాటు H-1B వీసాతో వచ్చే కొన్ని ఇబ్బందులు కూడా తన నిర్ణయానికి కారణమని 28 ఏళ్ల దిషా లాంబా తెలిపింది. దిషా 2021లో న్యూయార్క్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్లింది. చదువు పూర్తయ్యాక అక్కడే కెరీర్‌ను కొనసాగించింది. 2024లో CVS హెల్త్‌లో డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం సంపాదించింది. మంచి జీతంతో అక్కడ మంచి జీవితాన్ని కూడా ఏర్పరచుకుంది. అమెరికాలో జీవించడం వల్ల తాను చాలా స్వతంత్రంగా, ధైర్యంగా మారానని దిషా చెప్పింది. అయితే ఆ స్వేచ్ఛకు మరోవైపు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయని తెలిపింది.

Also Read : 26వ తేదీ అంటేనే ప్రకృతి విపత్తులా..? 96 ఏళ్లుగా వెంటాడుతున్న సెంటిమెంట్!

అమెరికాలో నాకు మంచి జీవితం ఉంది. అయినా 2026 మేలో భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నాను. ప్రధాన కారణం కుటుంబానికి దగ్గరగా ఉండాలనుకోవడమే. అంతేకాదు, H-1B వీసాతో వచ్చే కొన్ని ఆంక్షలతో కూడా నేను సంతోషంగా లేనని దిషా చెప్పింది. న్యూయార్క్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో సాయంత్రం పని అయిపోయిన తర్వాత ఒంటరితనం ఎక్కువగా అనిపించేదని ఆమె తెలిపింది. సాయంత్రం 5 గంటలకు పని ముగిసిన తర్వాత తన రోజు ఎలా గడిచిందో అడిగే కుటుంబ సభ్యులు దగ్గరలో ఉండేవారు కాదని చెప్పింది. నాకు స్నేహితులు ఉన్నారు. కానీ స్నేహితులు కుటుంబ సభ్యుల స్థానాన్ని భర్తీ చేయలేరు. నా బెస్ట్ ఫ్రెండ్ అయిన అమ్మతో వీడియో కాల్స్ మాట్లాడాలంటే భారత్, అమెరికా టైమ్ డిఫరెన్స్‌కు తగ్గట్టుగా ముందే సమయం ప్లాన్ చేసుకోవాల్సి వచ్చేదని ఆమె తెలిపింది.

H-1B వీసాకు కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, తనకు దాని వల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువగా అనిపించాయని దిషా చెప్పింది. ముఖ్యంగా ఉద్యోగం మార్చుకోవడం, అదనంగా ఆదాయం వచ్చే పనులు చేయడం, కొంతకాలం కెరీర్‌కు బ్రేక్ ఇవ్వడం వంటి విషయాల్లో పరిమితులు ఉంటాయని తెలిపింది. H-1B వీసాతో అమెరికా నుంచి భారత్‌కు ప్రయాణించి తిరిగి వెళ్లాలంటే వీసా స్టాంపింగ్ వంటి ప్రక్రియలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె చెప్పింది. సాధారణంగా H-1B వీసా మూడు సంవత్సరాల కాలానికి మంజూరవుతుందని, అందువల్ల ఎప్పటికప్పుడు వీసా సంబంధిత పనులను చూసుకోవాల్సి వస్తుందనే ఒత్తిడి తనకు ఉండేదని తెలిపింది.

ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత దిషా గురుగ్రామ్‌కు తిరిగి వచ్చి తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఉంటోంది. ఉద్యోగం లేకపోయినా రెండు నెలలు కెరీర్ బ్రేక్ తీసుకోవడం తనకు సాధ్యమైందని చెప్పింది. అమెరికాలో ఉద్యోగ వీసాతో ఉన్నప్పుడు ఇలాంటి బ్రేక్ తీసుకోవడం అంత సులభం కాదని ఆమె అభిప్రాయపడింది. ప్రస్తుతం చేతిలో కొత్త ఉద్యోగ ఆఫర్ లేకపోయినా భారత్‌లో కూడా అమెరికాతో సమానమైన కెరీర్ అవకాశాలు ఉన్నాయని దిషా చెబుతోంది.

Also Read : డార్క్ వెబ్‌లో ఉగ్ర కుట్ర.. అశ్లీల సైట్లు, సీక్రెట్ యాప్‌లతో పాక్ ISI డర్టీ గేమ్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.