Nepal : ఏడాదిలో 365 రోజులు ఉంటాయి. ప్రకృతి విపత్తులు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు. ఒకట్రెండు సార్లు ఒకే తేదీన విపత్తు జరిగితే దాన్ని కాకతాళీయం అనుకోవచ్చు. కానీ.. ఏళ్ల తరబడి, దేశాలు మారినా, నెలలు మారినా.. పెద్ద పెద్ద ప్రకృతి విపత్తుల్లో చాలా వరకు 26వ తేదీనే జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా నేపాల్‌లో మెరుపు వరదలు కూడా ఆగస్టు 26న సంభవించాయి. దీంతో మరోసారి 26వ తేదీ గురించి చర్చ మొదలైంది. సుమారు 96 ఏళ్ల క్రితం మొదలైన ఈ వరుసలో ప్రకృతి విపత్తులతో పాటు మానవ తప్పిదాల వల్ల జరిగిన కొన్ని భారీ ప్రమాదాలు కూడా ఉన్నాయి.

Also Read : లక్షల్లో జీతం, H-1B వీసా ఉన్నా అమెరికాను వదిలేసింది .. ఎందుకంటే?

ఆగస్టు 26, 2026.. నేపాల్‌లో వరదలు : తాజాగా ఆగస్టు 26న నేపాల్‌లోని రసువా జిల్లాను భారీ వరదలు ముంచెత్తాయి. హిమాలయాల్లోని ఓ హిమానీనదం ఒక్కసారిగా విరిగిపడటంతో భోటే కోశి నదికి భారీగా వరద నీరు వచ్చింది. దీంతో పలు గ్రామాలు నీట మునిగాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. జలవిద్యుత్ ప్రాజెక్టులు, ఇతర మౌలిక వసతులు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో 900 మందికి పైగా మరణించగా.. దాదాపు 4,500 మంది గల్లంతైనట్లు సమాచారం.

అక్టోబర్ 26, 2015.. హిందూకుష్ భూకంపం : 2015 అక్టోబర్ 26న హిందూకుష్ ప్రాంతంలో 7.5 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీని ప్రభావం అఫ్గానిస్తాన్, పాకిస్థాన్‌తో పాటు భారత్‌లోని కొన్ని ప్రాంతాలపై కూడా పడింది. ఈ భూకంపంలో దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోయారు.

మే 26, 2006.. ఇండోనేషియాలో యోగ్యకర్త భూకంపం : ఇండోనేషియాలోని జావా ద్వీపంలో యోగ్యకర్త సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి వేలాది ఇళ్లు, భవనాలు కూలిపోయాయి. 5,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

జూలై 26, 2005.. మహారాష్ట్రను ముంచేసిన భారీ వర్షాలు : ముంబై ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని రోజు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిశాయి. ముంబైలో ఒక్కరోజులోనే ఏకంగా 944 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లు, ఇళ్లు, రైల్వే ట్రాక్‌లు పూర్తిగా నీట మునిగిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ వర్షాలు, వరదల కారణంగా 1,094 మంది ప్రాణాలు కోల్పోయారు.

డిసెంబర్ 26, 2004 : 2004 డిసెంబర్ 26న ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన ప్రకృతి విపత్తుల్లో ఒకటి సంభవించింది. సుమత్రా తీరానికి సమీపంలో 9.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దాని ప్రభావంతో ఏర్పడిన సునామీ హిందూ మహాసముద్ర తీర దేశాలపై విరుచుకుపడింది. ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయిలాండ్ సహా పలు దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాదాపు 2.28 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది గల్లంతయ్యారు. ఇప్పటికీ ఇది ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక ప్రకృతి విపత్తుల్లో ఒకటిగా గుర్తుండిపోయింది.

డిసెంబర్ 26, 2003.. ఇరాన్‌లో భూకంపం : ఇరాన్‌లోని బామ్ ప్రాంతంలో 6.6 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. చారిత్రక నగరమైన బామ్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది భవనాలు కూలిపోయాయి. ఈ ఘటనలో సుమారు 31 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

మార్చి 25–26, 2002.. అఫ్గానిస్తాన్‌లో వరుస భూకంపాలు : ఉత్తర అఫ్గానిస్తాన్‌లోని బఘ్లాన్ ప్రాంతంలో వరుస భూకంపాలు సంభవించాయి. రాత్రి సమయంలో భూకంపాలు రావడంతో మట్టి ఇళ్లు పెద్ద సంఖ్యలో కూలిపోయాయి. ఈ ఘటనలో సుమారు 1,800 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు.

జనవరి 26, 2001.. గుజరాత్‌ భూకంపం : దేశం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సమయంలో గుజరాత్‌లో భారీ భూకంపం సంభవించింది. ముఖ్యంగా కచ్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. ఈ భూకంపంలో సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 1.66 లక్షల మందికి పైగా గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది.

జూలై 26, 1963.. స్కోప్జే భూకంపం : 1963 జూలై 26న అప్పటి యుగోస్లేవియాలోని స్కోప్జే నగరంలో 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. నగరంలోని చాలా ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఈ విపత్తు కారణంగా సుమారు 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 1,070 మంది ప్రాణాలు కోల్పోయారు.

నవంబర్ 26, 1943.. టర్కీలో లాడిక్ భూకంపం : టర్కీలోని లాడిక్, సామ్‌సన్, హవ్జా ప్రాంతాల్లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉత్తర టర్కీలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ భూకంపంలో 4,020 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read : భారతీయులకు అమెరికా బిగ్ షాక్.. ఆ రూల్ క్యాన్సిల్.. ఇక ఐటీ నిపుణులకు కష్టకాలమే!

డిసెంబర్ 26–27, 1939.. టర్కీలో ఎర్జింకాన్ భూకంపం : 1939 డిసెంబర్ 26, 27 తేదీల్లో టర్కీలోని ఎర్జింకాన్ ప్రాంతంలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీని ధాటికి పెద్దఎత్తున విధ్వంసం జరిగింది. ఈ భూకంపంలో సుమారు 32,700 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. 26వ తేదీన జరిగిన ఘోర ప్రకృతి విపత్తుల చరిత్రలో ఇది కూడా ఒకటి.

ప్రకృతి విపత్తులే కాదు.. మానవ తప్పిదాలతో జరిగిన ఘటనల్లోనూ 26వ తేదీ!

26వ తేదీకి సంబంధించిన ఘటనలు ప్రకృతి విపత్తులకే పరిమితం కాలేదు. మానవ తప్పిదాలు, నిర్లక్ష్యం కారణంగా జరిగిన కొన్ని భారీ దుర్ఘటనలు కూడా ఇదే తేదీన చోటు చేసుకున్నాయి.

సెప్టెంబర్ 26, 2023.. ఇరాక్‌లో వెడ్డింగ్ హాల్ అగ్నిప్రమాదం : 2023 సెప్టెంబర్ 26న ఇరాక్‌లోని మోసుల్ సమీపంలోని ఖరాఖోష్‌లో ఓ వెడ్డింగ్ హాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకలో భవనం లోపలే పటాకులు పేల్చడంతో మంటలు చెలరేగాయి. పైరోటెక్నిక్స్ కారణంగా మండే వస్తువులకు నిప్పు అంటుకుంది. అప్పటికే హాల్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.

ఆగస్టు 26, 2021.. కాబూల్ ఎయిర్‌పోర్ట్ బాంబు పేలుడు : అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో మొత్తం 183 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 170 మంది అఫ్గాన్ పౌరులు కాగా.. 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు.

నవంబర్ 26, 2008.. ముంబై ఉగ్రదాడులు : ముంబైలో జరిగిన ఉగ్రదాడులు దేశాన్ని కుదిపేశాయి. పాకిస్థాన్‌కు చెందిన లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాదులు సముద్ర మార్గంలో ముంబైలోకి ప్రవేశించి పలు ప్రాంతాల్లో కాల్పులు జరిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడులు మూడు రోజుల పాటు కొనసాగాయి. భద్రతా బలగాలు తొమ్మిది మంది ఉగ్రవాదులను హతమార్చగా.. 166 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు.

మే 26, 1991.. లాడా ఎయిర్ ఫ్లైట్ 004 ప్రమాదం : బ్యాంకాక్ నుంచి వియన్నాకు వెళ్తున్న లాడా ఎయిర్‌కు చెందిన బోయింగ్ 767 విమానం థాయిలాండ్‌లో కూలిపోయింది. విమానంలోని ఇంజిన్ థ్రస్ట్ రివర్సర్ అనూహ్యంగా పనిచేయడంతో విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 223 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇలా చూస్తే.. 1939 నుంచి 2026 వరకు 26వ తేదీన ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో అనేక భారీ ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు, దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. నెలలు వేరు.. దేశాలు వేరు.. ఘటనలు వేరు. కానీ తేదీ మాత్రం చాలా సందర్భాల్లో 26 కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.