పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య వివాదం మళ్లీ చెలరేగింది. ఇరాన్‌ హర్ముజ్‌ జలసంధిలోని ‘లారక్‌’ దీవిపై అమెరికా దళాలు మెరుపు దాడులు(US Attack) జరిపాయి. దీనికి ప్రతికారంగా ఇరాన్ కూడా జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగించింది. జూలై తర్వాత ఇరాన్‌ భూభాగంపై అమెరికా జరిపిన తొలి దాడి ఇదే కావడంతో ఇరు దేశాల మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది.

హర్ముజ్‌ జలసంధిలో ఉన్న లారక్‌ దీవి వద్ద ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సిబ్బంది రెండు రాకెట్ లాంచర్ల ద్వారా సముద్రంలో నౌకా విధ్వంసక మైన్లను అమర్చడానికి సిద్ధమవుతున్నారని అమెరికా గుర్తించింది. అంతర్జాతీయంగా ఎంతో కీలకమైన ఈ నౌకాయాన మార్గానికి ప్రమాదం వాటిల్లకుండా ఉండేందుకే తాము ముందస్తు చర్యల్లో భాగంగా ఆ లాంచర్లను ధ్వంసం చేసినట్లు వాషింగ్టన్ ప్రకటించింది.

Also Read : ముస్లిం దేశాలన్నీ ఏకం కావాలి.. అమెరికా, ఇజ్రాయెల్‌ను ఎదుర్కోవాలి : మొజ్తబా ఖమేనీ

అమెరికా జరిపిన దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో తమ సైనిక సిబ్బందితో పాటు సాధారణ పౌరులు కూడా మరణించారని, గాయపడ్డారని తెలిపింది. ఈ దాడికి ఖచ్చితంగా శిక్ష తప్పదని హెచ్చరించిన IRGC దానికి అనుగుణంగానే జోర్డాన్‌లోని అమెరికా బలగాల స్థావరాలైన కింగ్‌ హుస్సేన్, అల్‌ అజ్రాక్‌లపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే ఈ క్షిపణులలో ఎనిమిది క్షిపణులను జోర్డాన్ గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా కూల్చివేసింది.

ఈ వివాదానికి ప్రధాన కేంద్రమైన లారక్‌ దీవి కేవలం 49 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నప్పటికీ వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా రవాణా అయ్యే మొత్తం చమురు, ద్రవీకృత సహజవాయువులో దాదాపు ఐదో వంతు ఈ హర్ముజ్‌ జలసంధి మార్గం గుండానే సాగుతుంది. ఇక్కడ ఎలాంటి అంతరాయం కలిగినా ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుంది.

సముద్రంలో మైన్ల ఏర్పాటు విషయంలో ‘జీరో టాలరెన్స్’ విధానం అమల్లో ఉంటుందని మైన్లను అమర్చే ఏ నౌకనైనా ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనే స్పష్టం చేశారు. తాజా సైనిక ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 2 శాతానికి పైగా పెరిగాయి. నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగాలు ఆందోళన చెందుతున్నాయి.

Also Read : రేవ్ పార్టీలో కాల్పులు.. ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు..