Nepal Floods : నేపాల్‌ వరదలు తీవ్ర ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. వందలాది మంది ఈ వరదల్లో గల్లంతయ్యారు. వరదలు కొంత తగ్గడంతో మృతదేహాలను వెలికితీసే పనిలో సహయక బృందాలు శ్రమిస్తున్నాయి. భారతదేశంతో సరిహద్దు పంచుకునే నేపాల్‌లోని చిత్వాన్‌ (Chitwan) జిల్లాలో అత్యధికంగా 132 మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. కాగా శవాలు వరద ధాటికి మనదేశంలోకి ప్రవేశించే గండక్‌ నదిలోకి కొట్టుకు వస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్‌ వద్ద గండక్‌ నదిలో మూడు మృతదేహాలను వెలికితీశారు. దాదాపు 200 కిలోమీటర్ల దూరం ఉన్న నేపాల్‌ సరిహద్దులు దాటి భారత్ వరకు మృతదేహాలు కొట్టుకొస్తున్నాయంటే విపత్తు తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

Also Read : హెచ్-1బీ వీసాదారులకు ట్రంప్‌ మరో షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దు?

నేపాల్‌లో హిమానీనదం ఒక్కసారిగా ఉప్పొంగడం వల్ల భోటెకోశి, త్రిశూలి నదులు ఉగ్రరూపం దాల్చి వరద రూపంలో తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఈ రెండు నదులు కలిసి నారాయణి నదిగా మారుతాయి. దీన్నే కాళీ గండకీ అని కూడా పిలుస్తారు. ఈ నది భారత్‌లోకి ప్రవహిస్తుంది. దీన్ని ఇక్కడ గండక్‌ అని పిలుస్తారు. ఇది భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల గుండా ప్రవహించి పట్నా సమీపంలోని హాజీపూర్‌-సోనేపూర్‌ వద్ద గంగా నదిలో కలుస్తుంది. దీంతో అక్కడి వరదల్లో చిక్కుకుని గల్లంతయ్యారు. కాగా ఆ మృతదేహాలు భారత్‌లోకి కొట్టుకొస్తున్నాయి.

భారత్‌లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఆనుకుని ఉన్న నేపాల్ దక్షిణ ప్రాంతం నుంచి ప్రవహిస్తున్న గండక్‌ నదిలో పెద్ద ఎత్తున శవాలు కొట్టుకొచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్, కుషీనగర్ జిల్లాల్లో నదుల గుండా కొట్టుకొచ్చిన 7 మృతదేహాలను అధికారులు గుర్తించి వెలికి తీశారు. మహారాజ్‌గంజ్ జిల్లాలో నదిలో తేలుతున్న 4 మృతదేహాలను వెలికితీసినట్లు జిల్లా మేజిస్ట్రేట్ గౌరవ్ సింగ్ సోగర్వాల్ తెలిపారు. మహారాజ్‌గంజ్ జిల్లాలో భారత సరిహద్దు భద్రతా దళం సశస్త్ర సీమా బల్‌ (SSB) వీటిని గుర్తించి మోటార్‌ బోట్ల సహాయంతో వెలికితీశాయి. ఈ మృతదేహాల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడివి ఉన్నాయని ఎస్‌ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ అరుణ్‌ పాండే తెలిపారు. వారి వివరాలు ఇంకా తెలియలేదు.

కాగా నేపాల్‌ వరదల కారణంగా ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. గండక్‌ నది పరీవాహక ప్రాంతాల్లోని పలు లోతట్టు గ్రామాల్లో నివసించే ప్రజలను అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోసారి వరదలు సంభవించే అవకాశం ఉందన్న వార్తలతో రెండు రాష్ట్రాల అధికారలు అప్రమత్తమయ్యారు. ప్రజలను నదీ పరివాహాక ప్రాంతాలకు దూరంగా తరలిస్తున్నారు.

Also Read : అమెరికాలో హత్య చేసి ఇండియాకు పరారీ.. నిందితుడు అరెస్ట్!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.