
Trump H-1B Rules : అమెరికాలో హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న విదేశీ నిపుణులకు మరో షాక్ తగలబోతుంది. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. విదేశీ నిపుణులకు ఇపుడు అందుబాటులో ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేసే దిశగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదన ప్రస్తుతం వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ (ఓఎంబీ) వద్ద సమీక్ష దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త నిబంధన గనక అమల్లోకి వస్తే, ఉద్యోగం కోల్పోయినహెచ్-1బీ వీసాదారులు, విదేశీ ఉద్యోగులు, తర్వాత అమెరికాలో ఉండి కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ఇప్పటివరకు 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఉండేది. కానీ, ఈ నిబంధన ఎత్తివేస్తే విదేశీ ఉద్యోగులు వెంటనే ఆ దేశం విడిచి వెళ్లిపోవలసి వస్తుంది. ఈ నబంధన అమలైతే అమెరికాలోని భారతీయ టెక్కీలపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంటుందని టెక్కీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : నేపాల్‌లో తొలగని వరద ముప్పు.. మళ్లీ పెను ప్రమాదం పొంచి ఉందా?
ప్రస్తుతం ఉన్న నిబంధన ప్రకారం అమెరికాలో హెచ్-1బీ, ఎల్-1, ఓ-1 వంటి నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలపై పనిచేస్తున్న టెక్కీలు ఎవరైనా ఒకవేళ తమ ఉద్యోగాన్ని కోల్పోతే, మరో ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా తమ ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌ను మార్చుకోవడానికి 60 రోజుల సమయం ఉంది. ఈ నిబంధనను2017లో ప్రవేశపెట్టారు. ఈ గ్రేస్ పీరియడ్ మూలంగా ఉద్యోగం కోల్పోయిన వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా, చట్టబద్ధంగా దేశంలో ఉంటూనే మరో ఉద్యోగం కోసం వెతుక్కోవడానికి వీలు కలుగుతోంది. ఈ వెసులుబాటు హెచ్-1బీ, హెచ్-1బీ1, ఎల్-1, ఓ-1, టీఎన్ ఈ-1, ఈ-2, ఈ-3, తదితర వీసాలపై పనిచేస్తున్న వారితో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకూ వర్తిస్తూ వచ్చింది.
అయితే ఈ నిబంధనను ఎత్తేయ్యాలని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ప్రతిపాదించింది. ఈ మేరకు ఇది ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యలేటరీ అఫైర్స్ (OIRA) సమీక్షను కూడా దాటినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ప్రతిపాదన తదుపరి నియంత్రణ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని చెప్తున్నారు. తాజా ప్రతిపాదన గనక తుది నిబంధనగా మారితే.. ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల వెసులుబాటు ఇకమీదట ఉండదు. దీంతో కొత్త ఉద్యోగం, వీసా స్టేటస్ మార్పు లేదా అమెరికా నుంచి వెళ్లిపోవడం వంటి నిర్ణయాలను వీలయినంత త్వరగా తీసుకోవాల్సి ఉంటుంది.
నిజానికి అమెరికాలో హెచ్-1బీ ఆమోదం పొందిన వారిలో భారతీయుల వాటా 70 శాతానికి పైగా ఉందని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) గణాంకాలు చెబుతున్నాయి.యూఎస్ జనాభా లెక్కల ప్రకారం అమెరికాలో 5.2 మిలియన్ల మందికి పైగా భారతీయ సంతతికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. అందువల్ల హెచ్-1బీ నిబంధనల్లో మార్పులు వస్తే భారతీయ టెక్ నిపుణులు, ఇంజినీర్లు, ఇతర ప్రొఫెషనల్స్‌పై గణనీయమైన ప్రభావం పడుతుంది. ఈ ప్రతిపాదన సమీక్ష దశలోనే ఉన్నప్పటికీ, దీనిపై భారతీయ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.









