
Karnataka : కర్ణాటక రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో బీజేపీ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో కర్ణాటక మంత్రి బి. నాగేంద్ర కంటతడి పెట్టుకుంటూ తన మంత్రి పదవికి రాజీనామా ప్రకటించారు. డి.కె. శివకుమార్ మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన కేవలం 25 రోజుల్లోనే ఆయన పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం.
వాల్మీకి కార్పొరేషన్ నిధుల అక్రమ మళ్లింపు ఆరోపణల కారణంగా సిద్ధరామయ్య ప్రభుత్వంలో 2024 జూన్‌లోనూ ఆయన ఒకసారి రాజీనామా చేశారు. ఆ తర్వాత సిద్ధరామయ్య స్థానంలో డి.కె. శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆగస్టు మొదటి వారంలో నాగేంద్ర తిరిగి మంత్రివర్గంలోకి వచ్చారు. నేను స్వచ్ఛందంగా నా మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను అని భావోద్వేగంతో విలేకరులతో చెప్పిన నాగేంద్ర.. తాను దళితుడనే కారణంతోనే టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.
దేశంలో గిరిజన వ్యక్తి ఎదగకూడదనే ఉద్దేశంతోనే నన్ను లక్ష్యంగా చేసుకున్నారు అని నాగేంద్ర విమర్శించారు. వాల్మీకి లావాదేవీల్లో ఎక్కడైనా నా సంతకం ఉందా? నేను దళితుడనే కారణంగానే నన్ను టార్గెట్ చేస్తున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లావాదేవీల్లో బ్యాంకులు ప్రమేయం ఉన్నప్పుడు తనను ఎందుకు బాధ్యుడిని చేస్తారని ప్రశ్నిస్తూ.. “అలా అయితే కేంద్ర ఆర్థిక మంత్రి కూడా బాధ్యులేనా? అని నిలదీశారు.
కన్నీళ్లు పెట్టుకుంటూ నాగేంద్ర మాట్లాడుతూ.. కర్ణాటక ప్రజలు అంతా గమనిస్తున్నారు. నాపై రోజువారీ వేల అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అని అన్నారు. నాగేంద్ర రాజీనామా డిమాండ్ చేస్తూ బీజేపీ, జేడీఎస్ S) పార్టీలు తీవ్ర ఆందోళనలు చేపట్టడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.
మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్పొరేషన్ నిధుల అక్రమ మళ్లింపు వ్యవహారంతో ఆయనకు సంబంధం ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక శాసనసభలో, బయట కూడా విపక్షాలు భారీ నిరసనలు చేపట్టాయి. సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు రాయచూరు నుంచి బళ్లారి వరకు భారీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు కూడా బీజేపీ, జేడీఎస్ ప్రకటించాయి.









