
India : ఇండియా టుడే-సివోటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కార్యకర్త, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే.. తన మాజీ బాస్, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను వెనక్కి నెట్టి ప్రధాన మంత్రి పదవికి ఇష్టమైన నాయకుల జాబితాలో స్వల్ప ఆధిక్యత సాధించారు. తాజా సర్వేలో ప్రధాని పదవికి అభిజిత్ దిప్కేకు 1.3 శాతం ఓట్లు రాగా, కేజ్రీవాల్‌కు 1.2 శాతం దక్కాయి.
శాతం పరంగా చూస్తే కేవలం 0.1 శాతం తేడానే ఉన్నప్పటికీ, రాజకీయంగా ఇది పెద్ద సంచలనంగా మారింది. 2020 నుంచి 2023 వరకు కేజ్రీవాల్ నాయకత్వంలో ఆప్ కమ్యూనికేషన్ టీమ్‌లో పనిచేసిన 30 ఏళ్ల అభిజిత్ దిప్కే.. ఇప్పుడు యూత్-డ్రివెన్ ప్రెజర్ మూవ్‌మెంట్‌కు నాయకుడిగా ఎదిగారు.
ఈ సర్వేలో ప్రధాని నరేంద్ర మోదీ 48.7 శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 27.1 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక తమిళనాడు సీఎం విజయ్ 9.2 శాతంతో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (2%), ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (1.7%) తర్వాత స్థానాల్లో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో 1.3 శాతంతో అభిజిత్ దిప్కే నిలిచారు. కేజ్రీవాల్ (1.2%) ఆయన వెనుక ఉన్నారు.
ప్రతిపక్ష కూటమికి ఎవరు నాయకత్వం వహించాలనే అంశంపై నిర్వహించిన సర్వేలో రాహుల్ గాంధీ 29% ఓట్లతో మొదటి స్థానంలో ఉండగా.. నూతనంగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ 12.2% ఓట్లతో అనూహ్యంగా రెండో స్థానానికి దూసుకొచ్చారు. మమతా బెనర్జీ (8.5%), అరవింద్ కేజ్రీవాల్ (7.5%) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.









