
Raksha Bandhan 2026 : వారమంతా సాఫ్ట్వేర్ కంపెనీలవైపు క్యూకట్టే హైదరాబాదీలు గురువారం సాయంత్రం నుంచి సొంతూర్లకు క్యూకట్టారు. దీంతో రోజు ట్రాఫిక్ రద్దీతో దర్శనమిచ్చే సాప్ట్వేర్ కంపెనీల దారులు బోసిపోయి దర్శనమిస్తున్నాయి. సాధారణంగా శని,ఆదివారాలు సెలవు దినాలుంటే శుక్రవారం సాయంత్రం నుంచి సొంతూర్లకు పయనమయ్యే హైదరాబాదీలు ఈసారి గురువారం సాయంత్రమే ఇంటిబాట పట్టారు. దీనికి కారణం శుక్రవారం రాఖీ పర్వదినం సందర్భంగా పలు సాఫ్ట్వేర్ కంపెనీలు సెలవుదినంగా ప్రకటించాయి. దీంతో మూడు రోజులు వరుసగా సెలవులు రావడంతో అంతా ఇంటి మొకం పట్టారు. కొన్ని కంపెనీలు సెలవు ప్రకటించనప్పటికీ చాలామంది సెలవు పెట్టి మరి ఇంటికి వెళుతున్నారు.
Also Read : డిసెంబర్లో రెండోదశ మున్సిపల్ ఎన్నికలు… ఆ తర్వాత జడ్పీ ఎన్నికల నోటిఫికేషన్?!
పలువురు తమ అక్కచెల్లెళ్లతో రాఖీ కట్టించుకునేందుకు ఊర్లకు పయనమవ్వగా, ఆడబిడ్డలు రక్షాబంధన్‌ను పురస్కరించుకుని తమ సోదరులకు రాఖీ కట్టేందుకు ఊర్లకు పయనమయ్యారు. రాఖీ పండుగతో పాటు వరుస సెలవులు కావడంతో నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో జేబీఎస్, ఎంజీబీఎస్ వెళ్లే మార్గాలన్నీ వాహనాల రద్దీతో నిండిపోయాయి. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్ బస్టాండ్లలో రద్దీ పెరిగింది. రాఖీ పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ.. దాదాపు 5 వేల ప్రత్యేక బస్సులను అధనంగా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అలాగే డిమాండ్ ఉన్న రూట్లలో అదనంగా సిటీ బస్సులను కూడా నడుపుతోంది.
కాగా మూడు రోజులు సెలవులు ఉండటంతో ఊర్లకు వెళ్లిన వారు తిరిగి రావడానికి వీలుగా ఈ నెల 27 నుంచి 31 వరకు 5 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలంగాణ ఆర్టీసీ తెలిపింది. ఇప్పటికే గతేడాది కంటే అదనంగా 240 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. వరంగల్, హన్మకొండ, నర్సంపేట, జనగాం, యాదాద్రి, తొర్రూరు వైపు వెళ్లేవారికోసం ఉప్పల్ నల్లచెరువు వద్ద తాత్కాలిక బస్టాండ్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో అదనపు సర్వీసులను ఆర్టీసీ ఏర్పాటు చేస్తోంది. అమితే ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీపై 50 శాతం అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. రాఖీ పండుగతో పాటు లాంగ్ వీకెండ్ కావడంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాఖీ రోజు తర్వాత తిరుగు ప్రయాణాల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు గాను 31 వరకు అధికారులు అధనపు బస్సులు నడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read : మంత్రి వర్గం నుంచి సురేఖ ఔట్?… వరంగల్ తూర్పులో హై టెన్షన్..









