Sadhguru Appeal : నేపాల్- టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఘోర ఆకస్మిక వరదల్లో (Flash Floods) ఈషా ఫౌండేషన్‌కు చెందిన 80 మంది సభ్యుల బృందం గల్లంతైంది. కైలాస మానససరోవర యాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా, ఆగస్టు 26న చైనా-టిబెట్ సరిహద్దులోని గైరోంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వద్ద ఉండగా ఈ భారీ జలప్రళయం సంభవించింది. ఈషా ఫౌండేషన్ నిర్వహించిన ‘ఈషా సేక్రెడ్ వాక్స్’ (Isha Sacred Walks) యాత్రలో భాగంగా వెళ్లిన 77 మంది యాత్రికులు, ముగ్గురు వాలంటీర్లు (ఒక వైద్యుడితో కలిపి) ప్రస్తుతం గల్లంతయ్యారు. ఈ గ్రూపులో 19 దేశాలకు చెందిన వారు ఉన్నారు. ఇందులో 53 మంది భారతీయ సంతతికి చెందిన వారు కాగా, మిగిలిన వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి వివిధ దేశాల పౌరులు. వీరిలో 46 మంది మహిళలు, 34 మంది పురుషులు ఉన్నారు.

Also Read : పిల్లలకు రీల్స్ పిచ్చి.. మెటా కంపెనీకి బిగ్ షాక్.. ఒక్క దెబ్బతో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో రాబోతున్న మార్పులు

టిబెట్ వైపు నుండి దూసుకొచ్చిన భారీ వరద అల గైరోంగ్ ఇమ్మిగ్రేషన్ భవనాన్ని, పరిసర ప్రాంతాలను పూర్తిగా ముంచెత్తింది. వరదల ధాటికి రహదారులు, ఫోన్ నెట్‌వర్క్‌లు పూర్తిగా దెబ్బతినడంతో ఆ ప్రాంతంతో సంబంధాలు తెగిపోయాయి. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ స్వయంగా ఆ ప్రాంతంలోనే ఉంటూ రెస్క్యూ ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన వారి కోసం వెతకడానికి, స్థానిక రెస్క్యూ టీమ్‌లతో కలిసి పనిచేయడానికి తమకు అనుమతి ఇవ్వాలని ఆయన అధికారులను కోరారు.వివిధ దేశాల రాయబార కార్యాలయాలకు కూడా ఈ సమాచారాన్ని అందించి సహాయం కోరినట్లు సద్గురు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. ఈ యాత్రకు వెళ్లిన మిగిలిన 21 గ్రూపులకు చెందిన 495 మంది యాత్రికులు సురక్షితంగా వెనక్కి వచ్చారని సంస్థ పేర్కొంది.

కాగా, పలువురు భక్తులు గల్లంతయిన పరిస్థితిపై ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు స్పందించారు. యాత్రికుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు తాను స్వయంగా గిరాంగ్ ప్రాంతానికి చేరుకున్నట్లు వెల్లడించారు. సహాయక, రెస్క్యూ చర్యల్లో అధికారులతో కలిసి పనిచేస్తున్నామని సద్గురు తెలిపారు. పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా, బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. తమవారి కుటుంబాలకు ఏదైనా సమాచారం అందించేందుకు, గాలింపు చర్యల్లో తమ వంతు సహాయం చేసేందుకు అనుమతించాలని చైనా అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Also Read : మంత్రి వర్గం నుంచి సురేఖ ఔట్‌?… వరంగల్‌ తూర్పులో హై టెన్షన్‌..

వరద ప్రభావిత ప్రాంతంలో ఉన్న సద్గురు..గల్లంతయిన యాత్రికుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో బాధితులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆందోళనను తాను అర్థం చేసుకుంటున్నానని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమైన ప్రతి సహాయక చర్యను చేపట్టేలా తాను స్వయంగా ఇక్కడ ఉన్నానని వారికి తెలిపారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ యాత్రికులకు సహాయం అందించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. అయితే భారీ వరదల కారణంగా సరిహద్దు ప్రాంతాల్లో రాకపోకలు, సమాచార వ్యవస్థలకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో రెస్క్యూ బృందాలకు సవాలుగా మారాయి. యాత్రికుల ప్రస్తుత పరిస్థితి, వారి ఆరోగ్య స్థితి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలపై మరిన్ని అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.