Oracle lay offs: ప్రముఖ టెక్ కంపెనీ ఒరాకిల్ లో మరోసారి భారీగా ఉద్యోగ కోతలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 10 వేల మంది ఉద్యోగాలను తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో ఇండియాలోని ఉద్యోగులు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే భారత్‌లో ఎంతమంది ఉద్యోగాలు పోతాయనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఒరాకిల్ ఇప్పటికే గత ఏడాది పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను తగ్గించింది. అదే సమయంలో క్లౌడ్ కంప్యూటింగ్, AI కోసం భారీగా డబ్బు ఖర్చు చేస్తోంది. ఒక్క విభాగంలోనే కాకుండా.. కంపెనీలోని పలు విభాగాల్లో ఉద్యోగాల కోతలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఒరాకిల్ ఉద్యోగుల్లో సెప్టెంబర్‌లో లేఆఫ్స్ జరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మొదట సెప్టెంబర్ 1న ఉద్యోగాల కోతలకు సంబంధించిన ప్రకటన రావచ్చని భావించారు. ఇప్పుడు సెప్టెంబర్ 15 మరో కీలక తేదీగా చర్చలోకి వచ్చింది. అయితే ఇప్పటివరకు ఏ తేదీన లేఆఫ్స్ ప్రకటిస్తారో, అసలు ఎంతమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తారో ఖచ్చితంగా తెలియదు. కొంతమంది మేనేజర్లకు కూడా తమ టీమ్‌లో ఏ ఉద్యోగాలు పోతాయనే దానిపై పూర్తి సమాచారం లేదని తెలుస్తోంది.

ఈ లేఆఫ్స్ జరిగితే ఒరాకిల్ ఇండియా ఉద్యోగులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఒరాకిల్ కు భారత్‌లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. ఇంజినీరింగ్, క్లౌడ్ సర్వీసులు, టెక్నాలజీ, సపోర్ట్ వంటి విభాగాల్లో ఇక్కడ పెద్ద టీమ్‌లు పనిచేస్తున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోతలు జరిగితే.. భారత్ కూడా దాని ప్రభావం నుంచి తప్పించుకోకపోవచ్చని భావిస్తున్నారు. ఒరాకిల్ లో ఉద్యోగుల సంఖ్య ఇప్పటికే గణనీయంగా తగ్గింది. 2025 మే చివరి నాటికి కంపెనీలో సుమారు 1.62 లక్షల మంది ఫుల్‌టైమ్ ఉద్యోగులు ఉన్నారు.

2026 మే నాటికి ఆ సంఖ్య సుమారు 1.41 లక్షలకు పడిపోయింది. అంటే ఒక్క ఏడాదిలోనే దాదాపు 21 వేల మంది ఉద్యోగులు తగ్గిపోయారు. ఇప్పుడు మరో 10 వేల ఉద్యోగాలను తగ్గించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఒరాకిల్ తన వార్షిక నివేదిక ప్రకారం.. గత ఏడాదిలో ఉద్యోగుల తొలగింపులు, ఇతర మార్పుల కోసం సుమారు 1.8 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇప్పుడు మరోసారి లేఆఫ్స్ జరిగితే.. క్లౌడ్, AI వైపు కంపెనీని మరింతగా మార్చుకునే ప్రక్రియలో ఇది మరో కీలక అడుగుగా మారే అవకాశం ఉంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.