Nepal Floods : ఆకస్మిక వరదలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ఇటీవల మనదేశంలోని అరుణాచలంలో ఒక్కసారిగా వరదలు విరుచుకు పడగా తాజాగా నేపాల్‌ను మెరుపు వరదలు ముంచెత్తాయి. దీని కారణంగా ఇప్పటికే 1000 మందికి పైగా ప్రజలు గల్లంతయ్యారు. అయితే ఈ వరదలు ఎందుకు సంభవించాయనే విషయంలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. నేపాల్‌ వరదల నేపథ్యాన్ని చూస్తే ముందుముందు ప్రతి దేశానికి ఇలాంటి ముప్పు తప్పకపోవచ్చనే సంకేతాలు వస్తున్నాయి. నేపాల్‌ లో వరదలకు రెండు కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. వాటిలో ఒకటి- హిమాలయాలు వేడెక్కుతుండటం వల్ల అస్థిర ప్రదేశాల్లో నీరు నిలిచిపోవడం. నిలిచి పోయిన ఆ నీరు భూప్రకంపనల వల్ల ఒకసారిగా ఉప్పోంగడం, రెండోది- రెండు టెక్టోనిక్‌ ప్లేట్లు పరస్పరం ఢీకొట్టుకుంటుండటంతో హిమాలయ పర్వత శ్రేణి ఇంకా నిర్మితమవుతుండటంగా భావిస్తున్నారు.

Also Read : నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఈశ ఫౌండేషన్ బృందం.. 80 మంది గల్లంతు?

టిబెట్ భూకంపం వల్ల…

కాగా, నేపాల్‌నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనాల్ మరో అనుమానం వ్యక్తం చేశాడు. టిబెట్‌లో సంభవించిన భూకంపం మూలంగా తమ దేశంలో వరదలకు కారణమై ఉండవచ్చన్నది ఆయన అభిప్రాయం. టిబెట్‌లో వచ్చిన భూంకంపం మూలంగా కొండచరియలు విరిగి పడి తమ దేశంలోని భోటేకోశీ నది వరదలకు దారి తీసి ఉంటాయని ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు మంత్రి ఖనాల్ అభిప్రాయపడ్డారు. టిబెట్‌లో బుధవారం ఉదయం 8.37 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందనే దానిపై నిపుణులు పరిశోధిస్తున్నారు. మరోవైపు, వరదలు ముంచెత్తిన రసువా జిల్లాకు అనుకుని ఉన్న గ్యిరోంగ్ పోర్టు ప్రాంతంలో (టిబెట్‌) భారీ వరద విరుచుకు పడ్డ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

భూకంపం మూలంగా నేపాల్-చైనా సరిహద్దుకు సమీపంలో భారీగా ముంచుచరియలు, కొండచరియలు విరిగిపడినట్టు శాటిలైట్ ఇమేజీల్లో కనిపించిందని నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. అంతకుముందే, లేండే నదికి అడ్డంగా పెద్ద పెద్ద మంచుచరియలు పేరుకు పోయాయి. దీంతో అక్కడ భారీగా నీరు నిలిచిపోయిందని ఖఠ్మాండూ యూనిర్సిటీ ప్రొఫెసర్ ఒకరు వెల్లడించారు. ఆ తరువాత నదికి అడ్డుగా ఉన్న మంచుచరియలు, కొండచరియలు అకస్మాత్తుగా పడిపోవడంతో ఎగువన ఉన్న లేండే నది నీరు ఒక్కసారిగా భోటే కోశీ నదిలోకి పోటెత్తి ఆకస్మిక వరదలకు కారణమైందని వారు అభిప్రాయపడ్డారు. ఆ సమయంలోనే టిబెట్‌లో భూకంపం కూడా సంభవించిందని ఆ కదలికల వల్లే మంచు చరియలు విరిగిపడి వరదలకు కారణమై ఉంటాయని వివరించారు.

ప్రస్తుతం నేపాల్‌లో వరదలకు కారణమైన బోటే కోశీ నదికి ఈ లేండే ఓ ఉపనది. ఈ నది టిబెట్‌లో మొదలై సరిహద్దును దాటి నేపాల్‌లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత భోటే కోశీ నదిలో కలుస్తుంది. ఆ భోటే కోశీ నది మరింత దిగవకు వచ్చేసరికి త్రిశూలీ నదిగా రూపాంతరం చెందుతుంది. అనంతరం ఈ త్రిశూలీ నది నేపాల్‌లోని దేవఘాట్ వద్ద కాళీ గండకి నదిలో కలుస్తుంది. అపుడు దాన్ని నారాయణి నదిగా పిలుస్తారు. ఆ నది అక్కడినుంచి భారత్‌లోకి (బిహార్) ప్రవేశిస్తుంది. భారత్‌లో ఈ నదిని గండక్ నదిగా పిలుస్తారు. ఇది బిహార్, యూపీల మధ్య సరిహద్దుమీదుగా ప్రవహించి చివరికి గంగా నదిలో కలుస్తుంది.

Also Read : రష్యాలో భారీ పేలుడు.. స్పాట్‌లో ఏడుగురు మృతి.. 152 మందికి గాయాలు

హిందు కుష్‌లో మంచు కరగడం వల్లే…

ఇక నేపాల్‌ వరదలకు మరో కారణం కూడా కనిపిస్తుంది. ఈ మెరుపు వరదలను ఇన్‌ల్యాండ్‌ సునామీ (భూభాగంలో వచ్చే సునామీ)గా కూడా పిలుస్తారు. ఇలాంటి సునామీల ముప్పు నేపాల్‌కు అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు ఇదివరకే హెచ్చరించారు. 2000 సంవత్సరం నుంచి హిమాలయాల్లోని హిందు కుష్‌ పర్వత శ్రేణుల్లో ఉన్న హిమానీనదుల్లో మంచు కరగడం ఎక్కువైంది. కరిగిన ఈ నీరు అస్థిర ప్రదేశాల్లో హిమనదీయ సరస్సులుగా మారుతోంది. ఈ సరస్సులు పర్వతాలపై నీటి బాంబుల్లా మారుతున్నాయి. భూ కదలికలు, ఇతర కారణాల వల్ల ఇవి ఒక్కసారిగా కట్టలు తెంచుకొని దిగువకు ప్రవహిస్తూ.. మెరుపు వరదలకు కారణమవుతున్నాయి. కోశీ-గండకీ- కర్నాలీ బేసిన్లలో 3,624 హిమనదీయ సరస్సులు ఉన్నట్లు ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) 2020లోనే వివరించింది. వీటిలో 47 అత్యంత ప్రమాదకరమైన హిమనదీయ సరస్సులుగా వెల్లడించింది. ఇందులో 25 టిబెట్‌లో ఉండగా, 21 నేపాల్‌లో, ఒకటి భారత్‌లో ఉన్నట్లు స్పష్టం చేసింది. హిమనదీయ సరస్సులు ఉప్పొంగడం, హిమపాతాల వంటి విపత్తులను ముందుగానే పసిగట్టి హెచ్చరించే సాంకేతిక వ్యవస్థలు ఇంకా అందుబాటులో లేకపోవడం నేపాల్‌కు మరింత ప్రతికూలంగా మారుతోందని నిపుణుల అభిప్రాయం.

హిమాలయాల ఎత్తు పెరగడం కూడా..

ఇది కూడా నేపాల్‌కు సమస్యనే. ఇండియన్, యూరేసియన్‌ టెక్టోనిక్‌ ప్లేట్లు (భూ ఫలకాలు) కలిసే జోన్‌లో నేపాల్‌ ఉంది. ఈ భూ ఫలకాలు ఏటా 20-21 మిల్లీమీటర్ల మేర ఒకదానికొకటి దగ్గరవుతున్నట్లు గుర్తించారు. దాదాపు 5 కోట్ల ఏళ్ల కిందట ఇండియన్, యూరేసియన్‌ టెక్టోనిక్‌ ప్లేట్లు పరస్పరం ఢీకొనడంతో హిమాలయాలు ఏర్పడటం మొదలైందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. నేటికి ఆ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతూనే ఉంది. అంటే హిమాలయాలు ఏటా సుమారు 5 మిల్లీమీటర్ల మేర ఎత్తు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం భూమిపై అత్యంత వేగంగా పెరుగుతున్న పర్వత శ్రేణి ఇదే కావడం గమనార్హం. ఈ పెరుగుదలతో ఏర్పడే విపరీతమైన ఒత్తిడి వల్ల భూకంపాలకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇలా వచ్చే భూకంపాల ప్రతి ప్రకంపనల వల్ల హిమనదీయ సరస్సులు కట్టలు తెంచుకొని దిగువకు పోటెత్తి వరద ముప్పును పెంచుతున్నాయని, బుధవారం నాటి వరద విలయం కూడా టిబెట్‌లో వచ్చిన ఓ భూకంపం కారణంగా హిమనదీయ సరస్సు ఉప్పొంగడం వల్ల సంబవించినదే అని అభిప్రాయపడుతున్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.