Akhilesh Yadav :  ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన హామీతో ముందుకు వచ్చారు. 2027లో ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు భారీ ఆర్థిక భరోసా కల్పిస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని మహిళలకు ఏటా రూ. 40,000 చొప్పున నగదు సాయం అందిస్తామని స్పష్టం చేశారు.

Also Read : MPSC సంచలన నిర్ణయం.. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష రద్దు!

వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల ప్రచారంలో భాగంగా స్త్రీ సమ్మాన్ సమృద్ధి యోజనను తమ ప్రధాన హామీగా అఖిలేష్ యాదవ్ తెరపైకి తెచ్చారు. ఈ పథకాన్ని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చనున్నట్లు తెలిపారు. జనాభాలో సగానికి పైగా ఉన్న మహిళల పూర్తి సాధికారత, స్వేచ్ఛ కోసం ఈ పథకం ఒక బలమైన నిబద్ధత అని ఆయన పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ముందుకు సాగేందుకు, ప్రగతి సాధించేందుకు ఈ వార్షిక ఆర్థిక సాయం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో మహిళల భద్రత విషయంలో తమ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు విద్య, వైద్యం, భద్రతా రంగాలలో చేపట్టిన అభివృద్ధిని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన జపనీస్ డెలిగేషన్ కూడా తాము గతంలో ఏర్పాటు చేసిన 1090 మహిళా హెల్ప్‌లైన్ గురించి ప్రస్తావించిందని, దీనిని బట్టి తమ పాలనలో మహిళా భద్రతకు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చామో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.

2012 నుంచి 2017 వరకు యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అఖిలేష్ యాదవ్, మరోసారి రాష్ట్రంలో పగ్గాలు చేపట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి, మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నషషష ఎన్డీయే కూటమికి ఎస్పీ గట్టి పోటీ ఇవ్వడానికి ఈ తాజా హామీలను ప్రధాన అస్త్రాలుగా మలుచుకుంటోంది.

Also Read : పాకిస్థాన్‌ అనుకూల వ్యక్తులతో రేవంత్‌కు పనేంటీ?.. మంత్రి కిషన్‌రెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.