MPSC : మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన రిక్రూట్‌మెంట్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 22న నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది.

గతంలో జూలై 22 నుంచి జూలై 26 మధ్య అభ్యర్థులు, ప్రజా ప్రతినిధుల నుంచి ఎంపీఎస్‌సీకి పలు ఫిర్యాదులు అందాయి. పరీక్షకు ముందే అనగా మార్చి 20 నాడే కొందరు అభ్యర్థులకు ప్రశ్నపత్రం సోషల్ మీడియా ద్వారా అందిందని ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదులపై స్పందించిన ఎంపీఎస్‌సీ జూలై 27న ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసి సమగ్ర విచారణ కోరింది. ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపి కమిషన్‌కు నివేదిక సమర్పించారు. విచారణలో ఒక అభ్యర్థికి ప్రశ్నపత్రం అందిందని, దాని ద్వారా ఆ వ్యక్తి లబ్ధి పొందినట్లు ప్రాథమికంగా తేల్చింది. అయితే దీనివలన ఇంకా చాలా మంది లబ్ధి పొందారా అనేది కమిషన్ పేర్కొనలేదు.

Also Read : TMC రెబల్ ఎంపీలకు బిగ్ షాక్.. లోక్‌సభ నోటీసులు!

పరీక్షల గోప్యత, పారదర్శకత, నిష్పక్షపాతతను కాపాడటానికి, అభ్యర్థుల నమ్మకాన్ని నిలబెట్టడానికే ఈ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీఎస్‌సీ స్పష్టం చేసింది. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు సంబంధించి ఎంపీఎస్‌సీ త్వరలో మళ్లీ పరీక్ష నిర్వహించనుంది. గతంలో ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా అభ్యర్థుల నుంచి ఎలాంటి అదనపు పరీక్ష ఫీజు కూడా వసూలు చేయబోమని స్పష్టం చేసింది. రీ ఎగ్జామ్ తేదీలను త్వరలోనే వేర్వేరుగా ప్రకటిస్తామని తెలిపింది.

ఈ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల నోటిఫికేషన్‌ను జూలై 2025 29న విడుదల చేశారు. మహారాష్ట్రలోని ఆరు డివిజనల్ హెడ్‌క్వార్టర్లలో 2026 మార్చి 22న ఆఫ్‌లైన్ విధానంలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. దీని ఫలితాలను జూన్ 12న ప్రకటించి, ఇంటర్వ్యూల కోసం 506 మంది అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేశారు. జూలై 1 నుంచి జూలై 22 మధ్య జరిగిన ఈ ఇంటర్వ్యూలకు 488 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ఇంటర్వ్యూల అనంతరం 488 మందితో తాత్కాలిక మెరిట్ జాబితాను కూడా విడుదల చేశారు. ఇందులో 485 మంది ఎంపికవ్వగా, ముగ్గురిని అనర్హులుగా తేల్చారు. అయితే తాజా పరిణామాలతో ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చిందని, అర్హులైన అభ్యర్థులందరికీ త్వరలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని కమిషన్ వెల్లడించింది.

Also Read : ఢిల్లీలో 2300 దాటిన స్వైన్‌ఫ్లూ కేసులు… కేంద్రం సంచలన ప్రకటన!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.