Konda Surekha : అధికార కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న రాజకీయ సంక్షోభంతో మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తారని ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలో కొండా వర్గీయులు ఆందోళనకు దిగే అవకాశం ఉందన్న సమాచారంతో ఆమె ప్రాతినధ్యం వహిస్తున్న వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒకవేళ కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తే నియోజకవర్గంలో ఎలాంటి నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పోలీస్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వరంగల్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని మట్టెవాడ, ఇంతెజార్‌గంజ్‌, మిల్స్‌కాలనీ, వరంగల్‌ పోచమ్మ మైదాన్‌ జంక్షన్‌, మండిబజార్‌, వరంగల్‌ చౌరస్తా, కాశిబుగ్గ జంక్షన్‌, ఎంజీఎం సెంటర్‌ తదితర ప్రాంతాల్లో మంగళవారం రాత్రినుంచే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ప్రత్యేకంచి వరంగల్‌ సబ్‌ డివిజన్‌కు అదనపు పోలీసు వాహనాలతోపాటు అదనపు పోలీస్‌ సిబ్బందిని మోహరించారు. డిస్ర్టిక్‌ గార్డ్‌ పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నగరంలో ప్రధాన కూడళ్లకు చేరుకుని పహారా కాస్తు్న్నారు.

Also Read : హైదరాబాద్‌ విమానాశ్రయంలో యూడీఎఫ్‌.. వెళ్లేవారికి తగ్గింపు… దిగే వారికి పెంపు

రాజీనామానా? బర్తరఫ్‌నా?

కాగా, రాష్ర్ట కాంగ్రెస్‌ పార్టీలో ఇటీవల నెలకొన్న సంఘటనల నేపథ్యంలో కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ సంఘం సిఫారసు నివేధికను పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఢిల్లీ పెద్దలకు అందజేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఏఐసీసీ పెద్దలు తదుపరి నిర్ణయంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ విషయంలో ఎలాంటి చర్య తీసుకోవాలన్న దానిపై అధిష్టానంలో తీవ్ర చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే, కొండా సురేఖను నేరుగా మంత్రి పదవి నుంచి తప్పించడమా? లేదా మరో రకంగా ఆమెను దూరం పెట్టడమా అనే కోణంలో అధిష్టానం ఆచీతూచి నిర్ణయం తీసుకునేందుకు తీవ్రంగా చర్చిస్తోంది. మహిళా కావడం, అందులోనూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్ల రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న అంశాన్ని కూడా ఏఐసీసీ నేతలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అందుకే ఆమెను సస్పెన్షన్‌ చేయడం కంటే రాజీనామా చేయించడం ద్వారా కొంత ప్రభావం తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, తుది నిర్ణయం తీసుకునే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో అధిష్టానం నేరుగా చర్చించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

Also Read : నాపై మోదీ కుట్ర.. సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు

చిన్నారెడ్డి పరిస్థితి ఏంటీ?

మరోవైపు సీనియర్‌ నేత చిన్నారెడ్డి విషయంలోనూ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. ఆయనను అధికార పదవి నుంచి తప్పిస్తారా? లేక మొదటి తప్పుగా కేవలం మందలింపుతో ముగిస్తారా? అనే అంశాలపై కూడా ఏఐసీసీ పెద్దలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, పార్టీపై, ముఖ్యమంత్రిపై ఇంతకంటే ఎక్కువగా కామెంట్‌ చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోని అధిష్టానం తనపై తీసుకుంటే ఆ తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం అని చిన్నారెడ్ది తన అనుచరులకు చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.

ఇదిలా ఉండగా రాష్ట్ర పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అటు ఢిల్లీ నాయకత్వం, ఇటు రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారాయి. ఈ క్రమంలో ప్రభుత్వంపై ఈ ప్రభావం పడకుండా ఉండేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధిష్టానం సీరియస్‌గా దృష్టి సారించింది. రానున్న అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ వ్యవహారానికి ముగింపు పలకాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొండా సురేఖ, చిన్నారెడ్డిపై ఎలాంటి చర్య ఉంటుందన్నది కాంగ్రెస్‌ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

కాగా.. మంత్రి కొండా సురేఖ నేడు వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన నున్నారు. అయితే, క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి నివేదిక పంపిన నేపథ్యంలో ఆమె పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తే కొండా సురేఖ రియాక్షన్‌పై పలువురు నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంత్రి సురేఖ మాత్రం ఈ అంశంపై మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.