
Sarah Khalifa : ఈజిప్టులో టీవీ ప్రెజెంటర్ సారా ఖలీఫాకు కోర్టు ఉరిశిక్ష విధించింది. భారీ డ్రగ్స్ కేసులో ఆమెతో పాటు మరో 11 మందికి మరణశిక్ష పడింది. డ్రగ్స్ తయారీ, అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాలో ఆమె కూడా భాగమని కోర్టు తేల్చింది. అయితే సారా మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను మొదటి నుంచి ఖండిస్తూ వస్తున్నారు.
39 ఏళ్ల సారా ఖలీఫా ఈజిప్టులో టీవీ ప్రెజెంటర్‌గా గుర్తింపు పొందారు. భద్రత, నేరాలకు సంబంధించిన ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే కార్యక్రమానికి ఆమె హోస్ట్‌గా వ్యవహరించారు. టీవీ రంగంతో పాటు ఆమెకు కాస్మెటిక్ సర్జరీ క్లినిక్, పార్టీలు, ఈవెంట్లు నిర్వహించే ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉన్నట్లు సమాచారం.
Also Read : వరల్డ్ మోడలింగ్ బెంచ్ నుంచి క్లాస్‌రూమ్ వరకు.. 73వ ‘మిస్ వరల్డ్’గా నిలిచిన టీచర్ జోహెరీ!
డ్రగ్స్ కేసు దర్యాప్తులో 750 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు, డ్రగ్స్ తయారీకి ఉపయోగించే పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఈజిప్టు మీడియా తెలిపింది. డ్రగ్స్ తయారీకి ఉపయోగిస్తున్నట్లు అనుమానించిన రెండు అపార్ట్‌మెంట్లను కూడా గుర్తించారు. అక్కడ అక్రమ తుపాకులు, బుల్లెట్లు కూడా లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో 20 మంది సాక్షుల వాంగ్మూలాలతో పాటు ఫోన్ మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలను కూడా ఆధారాలుగా సమర్పించారు.
అయితే సారా ఖలీఫా మాత్రం తాను నిర్దోషినని చెబుతున్నారు. తన జీవితంలో డ్రగ్స్‌ను ఎప్పుడూ చూడలేదని, తనను డ్రగ్స్‌తో ఫొటోలు తీసినప్పుడు కూడా అవి ఎలా వచ్చాయో తెలియదని కోర్టులో చెప్పినట్లు సమాచారం. కోర్టులో ఆమె కన్నీళ్లు పెట్టుకుని తనను నమ్మాలని, తన తల్లిదండ్రులు తనను మంచి విలువలతో పెంచారని న్యాయమూర్తిని వేడుకున్నట్లు ఈజిప్టు మీడియా వెల్లడించింది. ఆమె తరఫు న్యాయవాది ఈ తీర్పుపై అప్పీల్ చేయనున్నట్లు తెలిపారు.
ఈజిప్టులో డ్రగ్స్ అక్రమ రవాణా వంటి కొన్ని నేరాలకు మరణశిక్ష అమల్లో ఉంది. సారా ఖలీఫాకు విధించిన శిక్షను అధికారికంగా ఖరారు చేయడానికి ఈజిప్టు గ్రాండ్ ముఫ్తీ అభిప్రాయం కూడా తీసుకున్నట్లు సమాచారం. 2025లో ఈజిప్టులో 492 మరణశిక్షలు విధించగా, 23 మందిని ఉరితీసినట్లు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. డ్రగ్స్ కేసుల్లో మరణశిక్ష విధించడంపై మానవ హక్కుల సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
Also Read : నేపాల్ లో కొనసాగుతున్న రెస్క్యూ.. 11 రోజుల తర్వాత సజీవంగా 64 ఏళ్ళ వృద్దురాలు









