Mojtaba :అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపులు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఆదివారం నాడు టెహ్రాన్‌లోని ‘ఇమామ్ ఖొమేని గ్రాండ్ మొసల్లా’ మైదానంలో జరిగిన ప్రార్థనల్లో వేలాది మంది ప్రజలు పాల్గొని ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. అయితే, ఈ అంత్యక్రియల వేడుకల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి కనిపించకపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆయనే అలీ ఖమేనీ కొడుకు, ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా భావిస్తున్న 56 ఏళ్ల మొజ్తబా ఖమేనీ.

అలీ ఖమేనీ అంత్యక్రియల వేడుకల్లో ఆయన ముగ్గురు కొడుకులు ముస్తఫా, మైసమ్, మసూద్‌లు తమ తండ్రి శవపేటిక పక్కనే నిలబడి ప్రార్థనలు చేశారు. దీనికి సంబంధించిన విజువల్స్‌ను ఇరాన్ ప్రభుత్వ మీడియా కూడా టెలికాస్ట్ చేసింది. అంతేకాదు, ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియన్, పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాకర్ కాలిబాఫ్, ఐఆర్‌జీసీ చీఫ్ జనరల్ అహ్మద్ వాహిదీ, ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఇస్మాయిల్ ఖానీ వంటి దేశ అగ్రనేతలంతా ఈ అంత్యక్రియలకు వచ్చారు. కానీ, వారసుడైన మొజ్తబా మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆరు రోజుల పాటు జరిగే ఈ అంత్యక్రియల ఊరేగింపు మొత్తానికి మొజ్తబా దూరంగా ఉంటారని ఇరాన్ అధికారులు ఇదివరకే ప్రకటించారు. దాంతో అసలు మొజ్తబా ఎక్కడున్నారు? ఆయనకు ఏమైంది? అనే అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి.

అసలు ఏం జరిగిందంటే.. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి జరిపిన భారీ వైమానిక దాడుల్లోనే అలీ ఖమేనీ మరణించారు. అప్పటినుంచి మొజ్తబా ఖమేనీ కూడా ప్రజల ముందుకు రాలేదు. ఆ దాడుల్లో మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం ఆయనకు రహస్యంగా చికిత్స అందిస్తున్నారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. మొజ్తబా బతికే ఉన్నాడా లేదా అనేదానిపై తమకు పూర్తి స్పష్టత లేదని, కానీ అతను “ఏదో ఒక రూపంలో” బతికే ఉన్నాడని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో అతనితో సమావేశం అవుతామని కూడా ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఇరాన్ అధికారులు మాత్రం మొజ్తబా క్షేమంగానే ఉన్నారని చెబుతున్నప్పటికీ, దానికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు గానీ, వీడియోలు గానీ ఇంతవరకు బయటకు విడుదల చేయలేదు.

మరోవైపు ఆదివారం నాడు అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పబ్లిక్ హాలిడే ప్రకటించింది. ఖమేనీని కడసారి చూసేందుకు జనం లక్షలాదిగా తరలివచ్చారు. తమ నాయకుడిని చంపిన శత్రువులపై కచ్చితంగా పగ తీర్చుకోవాలని, శాంతి చర్చలు వద్దంటూ అక్కడి ప్రజలు నినాదాలు చేశారు. ఈ అంత్యక్రియలకు వచ్చిన జనసందోహాన్ని చూసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రజలందరికీ అలీ ఖమేనీ అంటే ఇష్టం ఉండదని తాను అనుకున్నానని, కానీ ఇంత మంది జనం రావడం చూసి షాక్ అయ్యానని ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.