Hormuz : ప్రపంచం ఉలిక్కిపడేలా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మళ్ళీ యుద్ధ వాతావరణం నెలకొంది. హార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న సైప్రస్‌కు చెందిన ఎంవీ జీఎఫ్ఎస్ గెలాక్సీ అనే కంటైనర్ నౌకపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దాడులు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఈ దాడిలో నౌక ఇంజిన్ రూమ్ దెబ్బతినడంతో పాటు భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సిబ్బందిలో ఒకరు గల్లంతయ్యారు.

దీనిని తీవ్రంగా పరిగణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వెంటనే ప్రతీకార దాడులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం తెల్లవారుజామున 5:45 గంటలకు అమెరికా దళాలు ఇరాన్‌పై మూడవ విడత దాడులను మొదలుపెట్టాయి. ఇరాన్ తీరంలోని బుషెర్, అసలుయే, బందర్ అబ్బాస్, జస్క్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ తన సామర్థ్యాన్ని ఉపయోగించి వాణిజ్య నౌకలను అడ్డుకోవడాన్ని సహించేది లేదని, ఇరాన్ తీసుకున్న తప్పుడు నిర్ణయానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరించారు.

మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. తమ నౌకలపై అమెరికా జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ, అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి మాట్లాడుతూ, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా అమెరికా వ్యవహరిస్తోందని, ముఖ్యంగా ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని మండిపడ్డారు. ఈ పరిణామాలతో హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కూడా ఇప్పుడు చెల్లదని అమెరికా ప్రకటించడంతో, ఈ రెండు దేశాల మధ్య తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.