Hero Arya

Hero Arya :  తమిళ హీరో ఆర్య చిక్కుల్లో పడ్డారు. సినిమా షూటింగ్ కోసం తీసుకున్న ఖరీదైన కెమెరాల అద్దె చెల్లించకుండా కోట్లాది రూపాయల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనపై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు అనంతన్‌ కాడు అనే సినిమా షూటింగ్ కోసం ఆర్య, ఆ చిత్ర నిర్మాత వినోద్, తమ సంస్థకు అత్యుత్తమ కెమెరాలు, లైటింగ్‌ పరికరాలు కావాలని జూబ్లీహిల్స్‌లోని తాహేర్‌ సినీ టెక్నిక్‌ అనే సంస్థను సంప్రదించారు. ఒప్పందం ప్రకారం, ఆ సంస్థ వారు హైదరాబాద్ నుంచి కేరళకు తమ సొంత ఖర్చుతోనే అన్ని పరికరాలను పంపించారు.

సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యే వరకు ఆ పరికరాలను వాడుకున్న మేకర్స్, ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన రూ. 2.12 కోట్లలో.. రూ. 1.80 కోట్లకు పైగా బకాయి పడ్డారు. సినిమా విడుదలకు ముందే మొత్తం డబ్బు చెల్లిస్తామని, నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ ఇస్తామని మొదట హామీ ఇచ్చినప్పటికీ, తర్వాత మాట మార్చారు. బకాయిల గురించి అడిగిన సంస్థ ప్రతినిధులకు సరైన సమాధానం ఇవ్వకపోగా, కేరళలో కోర్టును ఆశ్రయించి తప్పుడు సమాచారంతో మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో నిలదీయడానికి వెళ్లిన తమ మేనేజర్‌ను హీరో ఆర్య, నిర్మాత వినోద్, వారి పీఏ కిశోర్ కలిసి బెదిరించారని, ఆ సంస్థ అకౌంటెంట్‌ జావేద్‌ అలీ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితుల ఫిర్యాదు మేరకు హీరో ఆర్య, నిర్మాత వినోద్‌తో పాటు మేకర్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పరికరాల అద్దె చెల్లించకుండా మోసగించడమే కాకుండా, అడిగిన వారిని బెదిరించడంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోలీవుడ్ , టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.