
Marjorie Taylor Greene : ఇరాన్-అమెరికా దేశాల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చిన వేళ అమెరికా కాంగ్రెస్ మాజీ సభ్యురాలు, రిపబ్లికన్ పార్టీ నాయకురాలు మర్జోరీ టేలర్ గ్రీన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇరాన్ లో అణ్వాయుధాలను నియంత్రించడమే తమ లక్ష్యమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయటకు చెప్తున్నప్పటికీ.. ఇరాన్‌పై అణుదాడులు చేయడానికి రహస్యంగా సన్నద్ధమవుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
ఇరాన్‌పై త్వరలో ఈ అణుదాడులు చేయడానికి ట్రంప్ యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోందని, ఇందుకోసం ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారులు వ్యూహాత్మక సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆమె వెల్లడించారు. ఒకవేళ అదే జరిగితే ఈ అణుదాడులవల్ల ప్రపంచం మొత్తం పెద్ద సంఘర్షణలోకి ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రజలు ముందుకు వచ్చి ఆయన చేస్తు్న్న చర్యలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 1945లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అణ్వాయుధాలను ప్రయోగించిన విషయాన్ని ఈ సందర్భంగా టేలర్ గ్రీన్ గుర్తుచేసుకున్నారు.
నాటి దాడుల మూలంగా ఇన్నేళ్లు గడిచినా జపాన్ ప్రజలు ఇప్పటికీ రేడియేషన్ వ్యాధులు, క్యాన్సర్, పుట్టుకతో సంక్రమించే లోపాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె గుర్తు చేశారు. ఒకవేళ ఇరాన్ పై అణు దాడి జరిగితే అదే పరిస్థితి ఇరాన్‌కు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉందని టేలర్ గ్రీన్ హెచ్చరించారు.
Also Read : 17 సార్లు లేట్.. మనిషిని ఉద్యోగం నుంచి తీసేసిన AI!
యుద్ధ భయంలో జీవించలేం..
కాగా రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నంతకాలం ప్రజలు భయపడుతూనే జీవించాల్సి ఉంటుందని ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖతామీ అభిప్రాయ పడ్డారు. ఈ పరిస్థితులు తొలగిపోయి శాంతియుత వాతావరణం నెలకొనేలా దౌత్య విధానాలను అవలంభించాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. ఇన్నాళ్లు బాహ్య ఒత్తిడిని తట్టుకొని ప్రభుత్వం నిలబడినప్పటికీ.. యుద్ధ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.. ఇదిలా ఉండగా అమెరికా, ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉన్నంతవరకు ఇరాన్ కూడా వాటిని సమకూర్చుకుంటూనే ఉంటుందని ఆ దేశ సీనియర్ కమాండర్ జనరల్ అహ్మద్ వాహిది వెల్లడించినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి.
Also Read : కొలంబియాను ఆదుకోండి.. ట్రంప్‌కు అబెర్డో రిక్వెస్ట్!









