
అమెరికా, సౌదీ అరేబియా మధ్య చారిత్రక న్యూక్లియర్ ఒప్పందం(US-Saudi Arabia Nuclear Deal) జరిగింది. అయితే దీనిపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్ ఈ ఒప్పందాన్ని సహించదని.. ఎలాగైనా సరే దీన్ని అడ్డుకొని తీరుతుందని ఇరాన్ బహిరంగంగా జోస్యం చెప్పింది. పశ్చిమాసియా ప్రాంతంలో ఏ ఇతర దేశమూ అణు శక్తిగా ఎదగడాన్ని ఇజ్రాయెల్ ఎంతమాత్రం జీర్ణించుకోలేదని ఇరాన్ తెలిపింది. ఈ డీల్‌ను దెబ్బతీయడానికి ఆ దేశం ఎంతటి తీవ్రమైన నిర్ణయానికైనా వెనుకాడదని కూడా ఇరాన్ పందెం కాసింది.
ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ ఈ విషయాలపై స్పందించారు. అణుశక్తిని కేవలం కొన్ని శక్తులే గుత్తాధిపత్యం చేయకూడదని, పౌర అవసరాల కోసం దాన్ని శాంతియుతంగా వినియోగించుకోవడం ప్రతి దేశం ప్రాథమిక హక్కు అని స్పష్టం చేశారు. అదే సమయంలో అమెరికా చేస్తున్న బెదిరింపులకు ఇరాన్ భయపడే ప్రసక్తే లేదని, తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, ఆత్మరక్షణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read : ట్రంప్ భార్య, కొడుకును లేపేస్తాం.. ఇరాన్ సంచలన వీడియో!
ఈ ప్రాంతంలో శాంతి నెలకొనాలా లేక యుద్ధం చెలరేగాలా అనే నిర్ణయాన్ని అమెరికా చేతిలో పెట్టబోమని ఇస్మాయిల్ తేల్చిచెప్పారు. అమెరికా, ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం, ఆ తర్వాత వ్యూహాత్మక హర్మూజ్ జలసంధి కేంద్రంగా మళ్లీ చెలరేగిన ఉద్రిక్తతలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు. తమకు జాతి ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని, ఇలాంటి కీలకమైన విషయాల్లో ప్రభుత్వం పక్కా నిబంధనల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడించారు.
పౌర అవసరాల నిమిత్తం సౌదీ అరేబియాకు యురేనియం సరఫరా చేసేందుకు.. ఆ దేశానికి స్వయంగా యురేనియం శుద్ధి చేసే సామర్థ్యాన్ని కల్పించేందుకు అమెరికా ముందుకు వచ్చింది. దీనికోసం రియాద్‌తో ఏకంగా 30 ఏళ్ల పాటు అమల్లో ఉండే భారీ ఒప్పందానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ డీల్ వల్ల ఎలాంటి అణ్వస్త్ర వ్యాప్తి జరగదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేసినప్పటికీ.. ఇజ్రాయెల్ మాత్రం దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉంది.
ఇరాన్‌పై జరిగిన సైనిక దురాక్రమణకు అమెరికానే పూర్తి బాధ్యత వహించాలని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ దాడుల వెనుక కొన్ని గల్ఫ్ ప్రాంతీయ దేశాల భాగస్వామ్యం కూడా ఉందనే అనుమానాలను వ్యక్తం చేశారు. అమెరికా ఆధిపత్య ధోరణిని, ఆగడాలను అరికట్టాలంటే ఐక్యంగా ప్రతిఘటించడమే ఏకైక మార్గమని ఇరాన్ స్పష్టం చేసింది.
Also Read : పీవోకేలో పాక్ ఆర్మీ అరాచకం.. కరెంట్ అడిగితే కాల్పులు.. 19 మంది మృతి









