
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికార బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ విదేశీ వలసదారులపై విరుచుకుపడుతున్నారు. అక్రమ వలసలను అరికట్టడమే లక్ష్యంగా ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరితో తాజాగా అమెరికా వీసాల రద్దు సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తన రెండో విడత పాలన ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఏకంగా 3 లక్షలకు పైగా వీసాలను ట్రంప్ రద్దు చేసినట్లు వెల్లడైంది. అమెరికా చరిత్రలోనే ఏ అధ్యక్షుడు కూడా ఈ స్థాయిలో వీసాలను నిలిపివేయలేదని ఆదేశ విదేశాంగ శాఖ స్పష్టం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగుతోంది.
ఈ భారీ వీసాల రద్దు వెనుక అత్యంత ప్రధానంగా ‘బర్త్ టూరిజం’ కీలక కారణంగా నిలిచింది. గర్భవతులుగా ఉన్న మహిళలు టూరిస్ట్ వీసాలపై అమెరికాకు వచ్చి పిల్లలకు జన్మనివ్వడం ద్వారా అక్కడి పౌరసత్వం పొందే వ్యూహంపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇందులో భాగంగా బర్త్ టూరిజంకు సహకరించిన నెట్వర్క్లు, సంబంధిత వ్యక్తులకు చెందిన దాదాపు 4 వేల వీసాలను రద్దు చేశారు. దీనితో పాటు నకిలీ పత్రాలు సమర్పించడం, తప్పుడు వివరాలు ఇవ్వడం, మద్యం తాగి వాహనాలు నడపడం, స్థానిక చట్టాలను ఉల్లంఘించడం వంటి నేరాలకు పాల్పడిన విదేశీయులను పసిగట్టి వారి వీసాలను రద్దు చేసినట్లు అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.
అమెరికా వీసా అభ్యర్థులు, ప్రస్తుతం అక్కడే ఉంటున్న విదేశీయులపై నిఘా పెట్టేందుకు ట్రంప్ యంత్రాంగం సోషల్ మీడియా తనిఖీ వ్యవస్థను మరింత కఠినతరం చేసింది. వీసా మంజూరు చేయడానికి ముందే అభ్యర్థి వేసే ప్రతి సోషల్ మీడియా పోస్టు కామెంట్లను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. వీసా గడువు ముగిసినా దొంగతనంగా అమెరికాలోనే తిష్టవేసిన వారిపై, చట్టాలను ధిక్కరిస్తున్న విదేశీ విద్యార్థులపై ప్రత్యేక నిఘా విభాగాలను రంగంలోకి దించారు. విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ ఈ వివరాలను ధ్రువీకరిస్తూ.. అమెరికా జాతీయ భద్రతకు, ప్రజా రక్షణకు భంగం కలిగించే ఎవరినీ సహించేది లేదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
అయితే రద్దయిన ఈ 3 లక్షల వీసాల్లో ఏ దేశ పౌరులు అత్యధికంగా ఉన్నారనే అధికారిక జాబితాను విదేశాంగ శాఖ గోప్యంగా ఉంచింది. అమెరికాలో ఉంటూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే విదేశీ పౌరులందరిపై ఈ కఠిన చర్యల పరంపర కొనసాగుతుందని యంత్రాంగం వెల్లడించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వీసాల రద్దు ప్రక్రియ రెట్టింపు వేగంతో సాగుతుండటంతో ఉద్యోగాలు, చదువు, పర్యటన నిమిత్తం అమెరికాకు వెళ్లాలనుకుంటున్న విదేశీయులతో పాటు అక్కడున్న భారతీయ సమాజంలోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.









