
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అబ్దుల్ చరిత్ర సృష్టించారు. అగ్రరాజ్య రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మిచిగాన్ సెనేట్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయీద్(Abdul El-Sayed) సంచలన విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన మైక్ రోజర్స్‌పై ఏకంగా 1,27,000 ఓట్లకు పైగా భారీ మెజారిటీతో గెలుపొంది, అమెరికా చరిత్రలోనే తొలి ముస్లిం సెనేటర్‌గా ఎన్నికై సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఈ ఎన్నికల్లో అబ్దుల్ ఎల్-సయీద్‌కు 18,72,595 ఓట్లు (50.74%) రాగా, ప్రత్యర్థి మైక్ రోజర్స్‌కు 17,45,183 ఓట్లు (47.29%) లభించాయి. డెసిషన్ డెస్క్ హెచ్‌క్యూ కూడా ఈ చారిత్రాత్మక విజయాన్ని ధృవీకరించడంతో పదివీ విరమణ చేస్తున్న సెనేటర్ గ్యారీ పీటర్స్ స్థానాన్ని డెమోక్రాట్లు విజయవంతంగా తమ ఖాతాలోనే నిలబెట్టుకున్నారు.
Also Read : అమెరికా మధ్యంతర ఎన్నికలు.. చరిత్ర సృష్టించిన పియా దాండియా.. వివేక్ రామస్వామికి బిగ్ షాక్!
Abdul e’ un coatto pieno di dottorati e di talenti, lo frena qualche elemento identitario ma ha reso l’allegro bullismo progressista again
— maria laura rodotà (@marilur1) November 4, 2026
ఈ విజయం కేవలం ఒక సాధారణ ఎన్నికల గెలుపు మాత్రమే కాదు. డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలకు ఓటర్లు ఇచ్చిన గట్టి సమాధానంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రచార సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అబ్దుల్‌ను నేరుగా జిహాదీ అని, ఉగ్రవాదుల మద్దతుదారుడని తీవ్రంగా ఆరోపించారు. అంతేకాకుండా ఆయన యుఎస్ కాంగ్రెస్‌లోకి ప్రవేశించే ముందు మెటల్ డిటెక్టర్ గుండా వెళ్లాలని వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన ఈ తీవ్రమైన వ్యాఖ్యలను అరబ్-అమెరికన్ సమాజంతో పాటు పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. అయితే ప్రజలు మాత్రం ట్రంప్ విమర్శలను తిరస్కరిస్తూ అబ్దుల్‌కు అఖండ విజయాన్ని అందించారు.
42 ఏళ్ల అబ్దుల్ ఎల్-సయీద్ కుటుంబ మూలాలు ఈజిప్టుకు చెందినవి. ఆయన మిచిగాన్‌లోని రోచెస్టర్ హిల్స్‌లో జన్మించారు. వృత్తిరీత్యా వైద్యుడైన ఆయన రాజకీయాల్లోకి రాకముందు డెట్రాయిట్, వేన్ కౌంటీ ఆరోగ్య విభాగాల ప్రభుత్వ అధికారిగా ప్రజారోగ్య రంగంలో సేవలు అందించారు. గతంలో 2018లో మిచిగాన్ గవర్నర్ రేసులో పోటీ చేసినప్పటికీ ప్రైమరీల్లో ఓటమి పాలయ్యారు. కానీ ఈసారి ప్రజలకు ప్రభుత్వ నిధులతోనే ఉచిత ఆరోగ్య సంరక్షణ అందించే మెడికేర్ ఫర్ ఆల్ నినాదంతో ముందుకు వెళ్లి ప్రజలను ఆకట్టుకున్నారు. కార్పొరేట్ల ఆర్థిక ప్రభావాన్ని రాజకీయాల నుంచి తొలగించాలని, ఇజ్రాయెల్‌కు అమెరికా ఇచ్చే బేషరతు సైనిక సహాయాన్ని ఆయన బహిరంగంగానే వ్యతిరేకించారు.
మిచిగాన్ అమెరికా రాజకీయాల్లో ఎంతో కీలకమైన స్వింగ్ స్టేట్‌గా గుర్తింపు పొందింది. ఇక్కడి డియర్‌బార్న్ ప్రాంతంలో అరబ్-అమెరికన్, ముస్లిం జనాభా అధికంగా ఉంటుంది. ఇక్కడ ఈద్ పండుగకు ప్రభుత్వ సెలవు రోజుగా గుర్తింపు ఉండటంతో పాటు అనేక మసీదులు, అరబిక్ భాషా సూచికలు ప్రతిచోటా కనిపిస్తాయి. డెమోక్రటిక్ పార్టీ ఈ ప్రాంతంలో ముస్లిం అభ్యర్థిని నిలబెట్టి గెలిపించడం ద్వారా ప్రగతిశీల రాజకీయాలకు పెద్దపీట వేసింది. ఈ విజయంతో రాబోయే 2028 అధ్యక్ష ఎన్నికల వ్యూహాల్లో డెమోక్రాట్లకు ఈ ప్రగతిశీల భావజాలం, ప్రజా ఆరోగ్య విధానాలు మరింత బలాన్ని చేకూరుస్తాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సెనేట్, హౌస్ రెండింటిలోనూ ట్రంప్ వర్గానికి ఎదురుదెబ్బ తగలడంతో పాటు అబ్దుల్ విజయం అమెరికా పార్లమెంట్‌లో నూతన శకానికి నాంది పలికింది.
Also Read : అమెరికాలో ట్రంప్‌కు పరీక్ష.. యావత్ ప్రపంచం దృష్టి అబ్దుల్‌పైనే!









