
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన ప్రఖ్యాత ‘నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ’ స్పేస్ టెలిస్కోప్ తన ప్రయాణాన్ని ముగించుకుని భూమి వైపు దూసుకొస్తోంది. దాదాపు 1500 కిలోల బరువున్న ఈ భారీ టెలిస్కోప్ నవంబర్ 4న భూ వాతావరణంలోకి రీ-ఎంట్రీ ఇవ్వనుంది.
భారత్ పరిధిలో క్రాష్ జోన్ ఈ శాటిలైట్ కూలిపోయే క్రాష్ జోన్లో భారత్‌తో పాటు ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా, మధ్య మరియు దక్షిణ అమెరికాలోని పలు ప్రాంతాలు ఉన్నాయి. నాసా మిషన్ చీఫ్ సైంటిస్ట్ బ్రాడ్ సెంకో వివరాల ప్రకారం.. ఈ టెలిస్కోప్ రీ-ఎంట్రీ పరిధి 20.6 డిగ్రీల దక్షిణ అక్షాంశం నుంచి 20.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం మధ్య విస్తరించి ఉంది.
భారత్ విషయానికి వస్తే, పశ్చిమాన డామన్ నుంచి తూర్పున ఒడిశాలోని కటక్ వరకు దక్షిణాన ఉన్న భూభాగమంతా ఈ పరిధిలోకి వస్తుంది. దీనివల్ల ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలు ఈ క్రాష్ జోన్ పరిధిలో ఉన్నాయి. భారత కాలమానం ప్రకారం నవంబర్ 4 మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇది వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
ఆందోళన అవసరమా? మొత్తం టెలిస్కోప్ బరువు 1500 కిలోలు అయినప్పటికీ, భూ వాతావరణంలోకి ప్రవేశించగానే ఏర్పడే తీవ్ర ఘర్షణ వల్ల చాలా భాగాలు గాల్లోనే కాలి బూడిదవుతాయి. కేవలం 100 కిలోల బరువుండే కొన్ని బలమైన విడిభాగాలు మాత్రమే భూమిని చేరే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ శకలాలు జనావాసాలపై కాకుండా సముద్రంలోనే పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
22 ఏళ్ల అద్భుత ప్రస్థానం 2004 నవంబర్ 20న లాంచ్ అయిన ఈ టెలిస్కోప్ దాదాపు 22 ఏళ్ల పాటు అద్భుత సేవలు అందించింది. తన లైఫ్‌టైమ్‌లో 2,000కు పైగా గామా కిరణాల విస్ఫోటనాలను (Gamma-ray bursts), 1,400కు పైగా సూపర్ నోవాలను రికార్డ్ చేసింది. అయితే కాలక్రమేణా ఆర్బిట్ క్షీణించడంతో, దీనిని తిరిగి సరైన కక్ష్యలో ఉంచేందుకు నాసా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో ఈ చారిత్రక టెలిస్కోప్ భూ వాతావరణంలో కలిసిపోవడం అనివార్యమైంది.









