
IRAN : ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా, ఇజ్రాయెల్, ఏడు అరబ్ దేశాల కీలక సైనిక అధికారులు రహస్యంగా సమావేశమైనట్లు సమాచారం. ఈ సమావేశాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే ఈ సమావేశం గురించి పాల్గొన్న దేశాల ప్రభుత్వాలు ముందుగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Also Read : జిన్‌పింగ్‌కు బ్రెయిన్‌స్ట్రోక్ ? కోమాలో చైనా అధ్యక్షుడు?
అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌తో యుద్ధంలోకి వెళ్లిన తర్వాత ఇలాంటి స్థాయిలో జరిగిన తొలి సమావేశం ఇదేనని తెలుస్తోంది. ఈ భేటీలో ఇజ్రాయెల్‌తో పాటు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఈజిప్ట్ దేశాల సీనియర్ సైనిక అధికారులు పాల్గొన్నట్లు సమాచారం. ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఇందులో పాల్గొన్న కొన్ని అరబ్ దేశాలకు ఇజ్రాయెల్‌తో అధికారిక దౌత్య సంబంధాలు కూడా లేవు.
ఇరాన్ నుంచి అమెరికా సైనిక స్థావరాలపై వరుసగా దాడులు జరుగుతున్నప్పటికీ.. మధ్యప్రాచ్యం నుంచి అమెరికా సైన్యాన్ని వెనక్కి తీసుకునే ఆలోచన లేదని అడ్మిరల్ బ్రాడ్ కూపర్ సమావేశంలో స్పష్టం చేసినట్లు యాక్సియోస్ తెలిపింది. అలాగే హార్ముజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలను మరింత పెంచేందుకు అమెరికా తీసుకుంటున్న చర్యల గురించి కూడా ఆయన ఇతర దేశాల సైనిక అధికారులకు వివరించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ రక్షణ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ ఐయాల్ జమీర్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఇజ్రాయెల్ ప్రస్తుతం పలు ప్రాంతాల్లో చేపడుతున్న సైనిక చర్యల గురించి ఆయన వివరించినట్లు తెలుస్తోంది.
2020లో అబ్రహం ఒప్పందాలు జరిగిన తర్వాత ఇజ్రాయెల్, కొన్ని అరబ్ దేశాల మధ్య సైనిక సహకారం క్రమంగా పెరిగింది. ముఖ్యంగా గగనతల రక్షణ, క్షిపణులను అడ్డుకోవడం వంటి అంశాల్లో ఈ సహకారం ఎక్కువగా ఉంది. ఇరాన్‌తో యుద్ధం సమయంలో ఇజ్రాయెల్, యూఏఈ, అమెరికా కలిసి రక్షణ చర్యల్లో పనిచేసినట్లు సమాచారం. ఇజ్రాయెల్ యూఏఈలో తన ‘ఐరన్ డోమ్’ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. అలాగే నిఘా, సమాచారం సేకరణలో యూఏఈకి సహాయం చేసినట్లు చెప్పారు.
Also Read : సౌదీపై హౌతీల దాడులు.. మక్కాలో తొలిసారి వైమానిక హెచ్చరికలు..









