Typhoon Maysak : తైఫూన్ మేసక్ (Typhoon Maysak) ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, నదుల పొంగిపొర్లుడు చైనాలోని ఒక ప్రశాంతమైన గ్రామాన్ని క్షణాల్లో భయాందోళనల్లోకి నెట్టివేశాయి. సాధారణంగానే పాములు అంటే చాలామందికి వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది హఠాత్తుగా గ్రామంలోకి కొట్టుకొచ్చిన వరద నీటిలో వందల సంఖ్యలో పాములు ఈదులాడుతూ కనిపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Also Read : వియత్నాంలో విషాదం: ‘ఫు క్వాక్’ దీవి వద్ద విహార నౌక మునక.. తెలుగు పర్యాటకులు మృతి

చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్‌ పరిధిలోని డెంగ్‌వెయ్ గ్రామంలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామానికి సమీపంలో ఉన్న ఒక భారీ పాముల పెంపకం కేంద్రం (Snake Farm) వరద నీటి ధాటికి కొట్టుకుపోయింది. దీంతో అందులో పెంచుతున్న సుమారు 900 పాములు ఒక్కసారిగా బయటకు వచ్చి గ్రామ వీధుల్లోకి, వరద నీట్లోకి ప్రవేశించాయి.

ఈ పాముల పెంపకం కేంద్రాన్ని ప్రధానంగా సాంప్రదాయ వైద్యం, మాంసం ఉత్పాదన, నాగుపాము విషం నుండి విరుగుడు మందులు (ఆంటీ-వెనమ్) తయారు చేయడానికి ఉపయోగించేవారని ‘గ్లోబల్ టైమ్స్’ నివేదించింది. స్థానిక విలేకరుల కథనం ప్రకారం.. తప్పించుకున్న పాములలో నీటి పాములు, కింగ్ రాట్ స్నేక్స్ (జెర్రిపోతులు) అత్యంత ప్రమాదకరమైన నాగుపాములు ఉన్నాయి.

వరద నీటిలో పాములు ఈదులాడుతుండటం, ప్రజలు డిప్ నెట్లతో వాటిని తోసేయడం, బురద నీటి నుండి నాగుపాములు తలలు పైకెత్తి చూడటం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. గ్రామానికి చెందిన వూ ఝీ అనే అధికారి మాట్లాడుతూ.. కొట్టుకుపోయిన పాములలో ఎక్కువ భాగం విషపూరితం కాని నీటి పాములేనని, ప్రస్తుతం వరద నీటిపై తేలియాడే చెత్తపై కొద్ది సంఖ్యలో మాత్రమే ఇవి మిగిలి ఉన్నాయని తెలిపారు.

తప్పించుకున్న పాములను తిరిగి పట్టుకోవడానికి 10 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. ఈ బృందం వలలు,ఎలక్ట్రిక్ ఫిషింగ్ పరికరాలను ఉపయోగించి పాములను బంధించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే తప్పించుకున్న వాటిలో అత్యంత విషపూరితమైన నాగుపాములు కూడా ఉండటంతో అధికారులు తీవ్ర జాగ్రత్తలు వహిస్తున్నారు.

Also Read : భారత ఆర్థిక వ్యవస్థకు సరికొత్త జవసత్వాలు..దేశ విదేశీ మారక నిల్వల్లొ భారీ వృద్ధి

పరిస్థితి తీవ్రతను బట్టి స్థానిక ప్రజలు ఎవరూ సొంతంగా పాములను పట్టుకోవడానికి ప్రయత్నించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇళ్లలోకి లేదా నివాస ప్రాంతాల్లోకి పాములు వస్తే వెంటనే గ్రామ కమిటీకి సమాచారం అందించాలని, శిక్షణ పొందిన సిబ్బంది వచ్చి వాటిని పట్టుకుంటారని వూ ఝీ స్పష్టం చేశారు.

సోమవారం, జులై 6న ఈ పాములు పెంపకం కేంద్రం నుండి తప్పించుకున్నట్లు ‘షాంఘై డైలీ’ పేర్కొంది. ఈ క్రమంలో వరద నీటిలోని ఒక పాము ఘాటుగా కాటు వేయడంతో ఒక గ్రామస్థుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. తైఫూన్ దాటికి లియులాన్, యున్‌బియావో రిజర్వాయర్లు పొంగిపొర్లుతుండటంతో ముందు జాగ్రత్తగా మరుసటి రోజు నాటికి 712 మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఈ భయానక వాతావరణంపై ఒక స్థానిక నివాసి మాట్లాడూతూ.. “ఇది నిజంగా వెన్నులో వణుకు పుట్టించే దృశ్యం. వరదలు పాముల ఫారమ్‌ను పూర్తిగా ధ్వంసం చేశాయి, ఇప్పుడు నీటితో సహా ఎక్కడ చూసినా ఆ సరీసృపాలే కనిపిస్తున్నాయి” అని తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.