
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్‌తో యుద్ధం విషయంలో నిజంగానే మనసు మార్చుకున్నారా? ఇరాన్‌ను పూర్తిగా లొంగదీసుకుని.. అణు కార్యక్రమాన్ని శాశ్వతంగా ఆపించాలన్న పట్టుదలతో ఉన్న ఆయన.. ఇప్పుడు అణు ఒప్పందం లేకుండానే యుద్ధాన్ని ముగించాలని ఎందుకు ఆలోచిస్తున్నారు? అమెరికా తన సైనిక లక్ష్యాలు అన్నీ సాధించేసిందని ట్రంప్ భావిస్తున్నారా? అలా అయితే.. ఇరాన్ మాత్రం ఎందుకు ఇంకా వెనక్కి తగ్గడం లేదు? అన్నింటికంటే ముఖ్యంగా.. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయలాంటి హోర్ముజ్ జలసంధినే ఇరాన్ ఇప్పుడు బేరసారాల సాధనంగా ఎందుకు మార్చింది? అసలు ట్రంప్ కోరుకుంటున్నది ఏంటి? ఇరాన్ పెడుతున్న షరతులేంటి? ఈ యుద్ధం నిజంగా ముగిసిపోతుందా? లేక హోర్ముజ్ దగ్గరే మరో కొత్త సంక్షోభం మొదలవుతుందా? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇరాన్‌తో యుద్ధం విషయంలో ట్రంప్ వైఖరిలో మార్పు కనిపిస్తోందన్న వార్త ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా దెబ్బతీయడం.. ఆ దేశం భవిష్యత్తులో అణ్వాయుధాన్ని తయారు చేయకుండా ఆపడం అమెరికా ప్రధాన లక్ష్యంగా కనిపించింది. కానీ ఇప్పుడు అణు ఒప్పందం లేకుండానే యుద్ధాన్ని ముగించే మార్గాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే.. ఇరాన్‌తో ఒక పూర్తి స్థాయి అణు ఒప్పందం కుదిరే వరకు యుద్ధాన్ని కొనసాగించాలన్న ఆలోచన కన్నా.. ఇప్పటికే అమెరికా సాధించిన మిలిటరీ సక్సెస్‌ను ఆధారంగా చేసుకుని యుద్ధాన్ని ముగించాలని.. ఇకపై ఇరాన్‌తో దౌత్యపరంగా సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన వైపు ట్రంప్ వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
Also Read : బాబ్ అల్ మాండెబ్‌లో నౌకపై హూతీల దాడి…ముగ్గురు నావికులు మృతి
దీనికి ప్రధాన కారణంగా 2025 జూన్‌లో అమెరికా చేపట్టిన ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్‌ను చూడాల్సి ఉంటుంది. ఇరాన్‌లోని కీలక న్యూక్లియర్ కేంద్రాలపై అమెరికా భారీ వైమానిక దాడులు చేసింది. ముఖ్యంగా ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ ప్రాంతాల్లోని అణు మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసుకుని ఈ దాడులు జరిగాయి. అత్యంత శక్తివంతమైన బంకర్-విధ్వంసక బాంబులను ఉపయోగించి ఇరాన్ అణు కేంద్రాలను దెబ్బతీసినట్లు అమెరికా ప్రకటించింది. ఈ దాడుల తర్వాత ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌కు భారీ నష్టం జరిగిందని, దాని అణ్వాయుధ తయారీ సామర్థ్యం గణనీయంగా వెనక్కి వెళ్లిందని అమెరికా వాదించింది. ట్రంప్ కూడా ఇరాన్ అణు మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చాలాసార్లు చెప్పారు. అయితే ఈ దాడులతో ఇరాన్ అణు కార్యక్రమం పూర్తిగా ముగిసిపోయిందా? లేక కొన్ని సామర్థ్యాలు ఇంకా మిగిలే ఉన్నాయా? అనే విషయంలో అంతర్జాతీయంగా భిన్నమైన అంచనాలు కూడా ఉన్నాయి.
అయినప్పటికీ ట్రంప్ లెక్క మాత్రం మరోలా కనిపిస్తోంది. ఇరాన్ అణు మౌలిక సదుపాయాలను ఇప్పటికే తీవ్రంగా దెబ్బతీశామని.. భవిష్యత్తులో ఇరాన్ మళ్లీ అణ్వాయుధ తయారీకి వెళ్లే ఛాన్స్ తక్కువగా ఉందని ట్రంప్ తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఇరాన్ ఆర్థికంగా, సైనికంగా కూడా దీర్ఘకాలిక యుద్ధాన్ని కొనసాగించే స్థితిలో లేదని అమెరికా అంచనా వేస్తోంది. అందుకే అమెరికా తన ప్రధాన సైనిక లక్ష్యాలను ఇప్పటికే పూర్తి చేసిందని భావిస్తే.. యుద్ధాన్ని మరింత పొడిగించాల్సిన అవసరం లేదన్న ఆలోచన ట్రంప్‌లో మొదలైనట్లు కనిపిస్తోంది. దీనికి తోడు యుద్ధం ఎక్కువకాలం కొనసాగితే అమెరికాకు కూడా సైనిక వ్యయం పెరుగుతుంది. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా సైనిక స్థావరాలు, సైనికులపై దాడుల ముప్పు పెరుగుతుంది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై ఒత్తిడి పెరిగితే అమెరికా ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం పడుతుంది. అందుకే యుద్ధం నిష్క్రమణ కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారనే సమాచారం వినిపిస్తోంది.
Also Read : సిరియా కోర్టు సంచలన తీర్పు…మాజీ అధ్యక్షునితో పాటు మరో ఇద్దరికీ మరణశిక్ష
అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. అమెరికా యుద్ధాన్ని ముగించాలనుకోవచ్చు.. కానీ ఇరాన్ మాత్రం అంత సులభంగా అందుకు ఒప్పుకునే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఇరాన్ దృష్టిలో ఇది కేవలం యుద్ధం ఆపడం మాత్రమే కాదు. యుద్ధం తర్వాత తమకు ఏం లభిస్తుంది అన్నదే అసలు ప్రశ్న. అందుకే అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయాలని ఇరాన్ కోరుతోంది. విదేశాల్లో నిలిపివేసిన ఇరానియన్ ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. అమెరికా సైనిక బలగాలను ప్రాంతం నుంచి వెనక్కి తీసుకెళ్లాలని చెబుతోంది. అంతేకాదు.. యుద్ధంలో ఇరాన్‌కు జరిగిన నష్టానికి పరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. అంటే.. అమెరికా యుద్ధం ముగించాలంటే ముందుగా తమకు అనుకూలంగా కొన్ని పనులు చేయాలని ఇరాన్ కోరుతోంది.
ఇక ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైనది హోర్ముజ్ జలసంధి. ప్రపంచ పటంలో చూస్తే ఇది చాలా చిన్న సముద్ర మార్గంలా కనిపిస్తుంది. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మాత్రం ఇది అత్యంత కీలకమైన నౌకా రవాణా మార్గం పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ మార్కెట్లకు భారీగా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, LNG తరలించేది ఈ మార్గం ద్వారానే.. రోజుకు దాదాపు 20 మిలియన్ బ్యారెళ్లకు పైగా హోర్ముజ్ పెట్రోలియం ద్రవాలు గుండా ప్రయాణిస్తాయి. ప్రపంచ చమురు వినియోగంలో ఇది దాదాపు ఐదో వంతు. అంతేకాదు.. హోర్ముజ్ ద్వారా వెళ్లే చమురులో అత్యధిక భాగం ఆసియా దేశాలకే చేరుతుంది. చైనా, భారతదేశం, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఈ మార్గంపై భారీగా ఆధారపడుతున్నాయి.
అందుకే హోర్ముజ్‌లో చిన్న అంతరాయం వచ్చినా ప్రపంచ మార్కెట్లు వెంటనే స్పందిస్తాయి. చమురు ట్యాంకర్లకు భద్రతపై అనుమానాలు వస్తే షిప్పింగ్ బీమా ఖర్చులు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరుగుతాయి. ముడి చమురు ధరలపై ఒత్తిడి పెరుగుతుంది. చమురు ధర పెరిగితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణంపై ప్రభావం పడుతుంది. అంటే హోర్ముజ్ సమస్య కేవలం ఇరాన్-అమెరికా మధ్య సమస్య కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన సమస్య. అందుకే ట్రంప్‌నకు కూడా హోర్ముజ్ను తిరిగి పూర్తిగా తెరిపించడం అత్యంత కీలకంగా మారింది.
ఇక్కడే ఇరాన్‌కు తన చేతిలో ఒక బలమైన బేరసారాల అస్త్రం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచానికి హోర్ముజ్ కావాలి. అమెరికాకు యుద్ధం ముగించాలి. ఆయిల్ మార్కెట్స్‌కు స్థిరత్వం కావాలి. ఈ పరిస్థితిని ఇరాన్ తనకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది. అమెరికా తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయకుండా, సైనిక ఒత్తిడిని తగ్గించకుండా, యుద్ధ నష్టానికి పరిహారం ఇవ్వకుండా హోర్ముజ్‌ను పూర్తిగా తెరవడం ఎందుకు? అనే స్థాయిలో ఇరాన్ నుంచి కండిషన్స్ వస్తున్నాయి. అంటే ఇంతకాలం అమెరికా ఇరాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చిందనుకుంటే.. ఇప్పుడు హోర్ముజ్ ద్వారా ఇరాన్ కూడా అమెరికాపై ఒత్తిడి పెంచుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ట్రంప్‌కు ఇదే పెద్ద చిక్కు. ఆయనకు ఒకవైపు యుద్ధాన్ని త్వరగా ముగించాలి. మరోవైపు అది అమెరికా ఓటమిలా కనిపించకూడదు. ట్రంప్ రాజకీయ కథనంలో “అమెరికా గెలిచింది” అనే మెసేజ్ చాలా కీలకం. అందుకే అణు ఒప్పందం కుదరకపోయినా.. అమెరికా తన సైనిక లక్ష్యాలను సాధించిందని.. ఇరాన్ అణు మౌలిక సదుపాయాలను తీవ్రంగా దెబ్బతీసిందని.. ఇప్పుడు కాల్పుల విరమణ ద్వారా యుద్ధాన్ని ముగించామని చెప్పగలిగితే.. అది ట్రంప్‌కు ఒక పరువు కాపాడే నిష్క్రమణ అవుతుంది. కానీ అందుకు హోర్ముజ్ తిరిగి తెరుచుకోవాలి. ప్రపంచ దేశాలకు నౌకలు ఎలాంటి భయం లేకుండా హోర్ముజ్ గుండా వెళ్లగలగాలి. ఇదే ఇప్పుడు ట్రంప్ ముందున్న ప్రధాన ఛాలెంజ్.
అయితే అణు ఒప్పందం లేకుండానే యుద్ధాన్ని ముగించడం వల్ల మరో సమస్య కూడా ఉంది. ఇరాన్‌కు అణు విజ్ఞానాన్ని పూర్తిగా తొలగించడం అంత సులభం కాదు. ఒక దేశంలోని అణు కేంద్రాలను బాంబులతో దెబ్బతీయవచ్చు. కానీ అక్కడి శాస్త్రవేత్తలు, సాంకేతిక నైపుణ్యం, అణు విజ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేయలేం. అందుకే భవిష్యత్తులో ఇరాన్ మళ్లీ తన అణు కార్యక్రమాన్ని మళ్లీ ఎలా అడ్డుకుంటారు అన్నది పెద్ద ప్రశ్న. న్యూక్లియర్ డీల్ ఉంటే తనిఖీలు, పర్యవేక్షణ, ధృవీకరణ వంటి వ్యవస్థల ద్వారా ఇరాన్‌పై నిఘా పెట్టే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి అగ్రిమెంట్ లేకుండా యుద్ధాన్ని ముగిస్తే.. భవిష్యత్తులో మళ్లీ అదే సమస్య తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళన ఉంటుంది.
అయితే ట్రంప్ లెక్కలో తక్షణ ఫలితాలకు ప్రాధాన్యం ఉండొచ్చు. ఒకవైపు యుద్ధం ఆగాలి. మరోవైపు హోర్ముజ్ తెరుచుకోవాలి. ఆయిల్ మార్కెట్‌లో స్థిరత్వం రావాలి. అమెరికా సైనికులపై ముప్పు తగ్గాలి. ఈ మొత్తం పరిణామాన్ని “మేము మా లక్ష్యాలను సాధించాము.’’ (We achieved our objectives) అంటూ ట్రంప్ తన రాజకీయ విజయంగా చూపించుకోవచ్చు. అందుకే న్యూక్లియర్ డీల్‌ను ఇప్పుడే సాధించకపోయినా.. ఆ అంశాన్ని తర్వాతి దశకు వాయిదా వేసి ముందుగా యుద్ధం ముగింపు చేయాలన్న ఆలోచన ఆయనకు కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
కానీ ఇరాన్ కూడా తన ప్రజలకు ఒక Victory చూపించాల్సిన పరిస్థితిలో ఉంది. అమెరికా దాడులు ఎదుర్కొన్న తర్వాత ఎలాంటి ప్రయోజనం లేకుండానే యుద్ధాన్ని ఆపేశామని ఇరాన్ ప్రభుత్వం చెప్పడం చాలా కష్టం. అందుకే ఆంక్షల సడలింపు, స్తంభింపజేసిన ఆస్తుల విడుదల, భద్రతా హామీలు వంటి అంశాలపై ఇరాన్ గట్టిగా పట్టుబడుతోంది. ఇరాన్‌కు మరో ముఖ్యమైన అంశం హోర్ముజ్. దాన్ని పూర్తిగా వదిలేస్తే తన చేతిలో ఉన్న పెద్ద ఆయుధాన్ని కోల్పోయినట్లవుతుంది. అందుకే హోర్ముజ్‌ను చర్చల వేదికపై ఒక బేరసారాల సాధనంగా ఉపయోగించడానికి ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ మొత్తం వ్యవహారంలో భారత్ పరిస్థితి కూడా చాలా కీలకం. ఎందుకంటే హోర్ముజ్ ద్వారా వెళ్లే చమురులో భారీ భాగం ఆసియా దేశాలకే వస్తుంది. అందులో భారత్ కూడా ఒక ముఖ్యమైన దేశం. మిడిల్ ఈస్ట్ నుంచి భారత్ భారీగా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. హోర్ముజ్‌లో షిప్పింగ్ సమస్య ఎక్కువకాలం కొనసాగితే ముడి చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. చమురు ధర పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి రావచ్చు. ట్రాన్స్‌పోర్ట్ వ్యయాలు పెరగొచ్చు. తయారీ వ్యయాలు పెరగొచ్చు. చివరికి ద్రవ్యోల్బణంపై కూడా ప్రభావం పడొచ్చు. అందుకే Iran-America మధ్య యుద్ధం ఎంత త్వరగా స్థిరమైన ముగింపుకు వస్తే భారత్‌కు కూడా అంత మంచిది.
ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా యుద్ధం ముగించాలని అనుకోవడం ఒకటి.. ఇరాన్ యుద్ధాన్ని ముగించడానికి అంగీకరించడం మరోటి. రెండు దేశాలు కూడా ముగింపు కోరుకుంటున్నా.. ఎవ్వరూ బలహీనంగా కనిపించడానికి సిద్ధంగా లేరు. అమెరికాకు విక్టరీ కావాలి. ఇరాన్‌కు తమపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలి, పరిహారం చెల్లించాలి. అలాగే ప్రపంచానికి హోర్ముజ్ కావాలి. ఆయిల్ మార్కెట్లకు స్థిరత్వం కావాలి.
అందుకే ఇప్పుడు అందరి చూపు హోర్ముజ్ జలసంధిపైనే ఉంది. హోర్ముజ్ పూర్తిగా తెరుచుకుంటే.. ట్రంప్ తనకు కావాల్సిన నిష్క్రమణ తీసుకున్నట్లే. అమెరికా సైనిక లక్ష్యాలు సాధించామని చెప్పుకోవచ్చు. కాల్పుల విరమణను పొడిగించవచ్చు. అణు సమస్యను తర్వాతి దశలో చర్చించవచ్చు. కానీ హోర్ముజ్ తెరుచుకోకపోతే.. ట్రంప్ విజయ కథనానికి పెద్ద సమస్య ఎదురవుతుంది. అయితే ట్రంప్ నిజంగానే అణు ఒప్పందం లేకుండానే ఇరాన్‌తో యుద్ధాన్ని ఆపేయాలని నిర్ణయించుకుంటారా? లేక ఇరాన్ ఆంక్షలు, పరిహారంపై పట్టుబట్టి హోర్ముజ్‌ను తన చేతిలోనే ఉంచుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. మొత్తానికి ఇరాన్-అమెరికా యుద్ధం ముగుస్తుందా లేదా మళ్లీ మొదలవుతుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.









