అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం పాలై కాంగ్రెస్‌పై నియంత్రణ కోల్పోవడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఓటమికి ప్రధానంగా ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధమే కారణమని ఆయన బహిరంగంగానే ఒప్పుకున్నారు. అయితే దేశ భద్రత దృష్ట్యా ఆ యుద్ధ నిర్ణయం సరైనదేనని, టెహ్రాన్ వద్ద అణు ఆయుధాలు లేకుండా చేయడానికి ఆ చర్య తీసుకోక తప్పలేదని స్పష్టం చేశారు.

ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికాలో పెట్రోల్ ధరలు ఊహించని రీతిలో ఆకాశాన్ని తాకాయి. నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలపై విపరీతమైన ఆర్థిక భారం పడింది. ఇదే అంశాన్ని తమ ప్రధాన అస్త్రంగా మార్చుకున్న డెమోక్రాట్లు ఎన్నికల్లో భారీ విజయాలు సాధించి సెనేట్, ప్రతినిధుల సభ రెండింటినీ కైవసం చేసుకున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సోషల్ మీడియా వేదికగా మనం ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం యుద్ధమే అని పెట్టిన పోస్టుతో తాను కూడా ఏకీభవిస్తున్నట్లు ట్రంప్ ఓ సమావేశంలో పేర్కొన్నారు.

వైట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ తనదైన శైలిలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ పరిస్థితుల్లో తాను అధ్యక్షుడిగా ఉండి వేరే ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయేవాడినని చెప్పారు. యుద్ధం ఎంత నష్టాన్ని తెచ్చినా దేశ ప్రయోజనాల దృష్ట్యా అది అనివార్యమని సమర్థించుకున్నారు. అయితే ఒకవేళ తానే స్వయంగా బ్యాలెట్‌లో అభ్యర్థిగా పోటీ చేసి ఉంటే మాత్రం ఫలితం ఖచ్చితంగా వేరేలా ఉండేదని, రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించి ఉండేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా పార్టీ ఓటమికి, తన సొంత క్రేజ్‌కు వ్యత్యాసం ఉందనే సంకేతాన్ని ఇచ్చేందుకు ట్రంప్ ప్రయత్నించారు. తనకున్న ప్రజాదరణను ఇతర అభ్యర్థుల గెలుపునకు వాడుకోవడంలో పార్టీ వ్యవస్థలు విఫలమయ్యాయనే చెప్పవచ్చు.

తన ర్యాలీలలో లక్షలాది మంది ప్రజల నుంచి అపారమైన ప్రేమ, మద్దతు లభించిందని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. మా ర్యాలీలలో అద్భుతమైన ప్రేమ ప్రవహించేది. కానీ ఆ ప్రేమను మా పార్టీ అభ్యర్థుల వైపు తిప్పడంలో,వారికి ఓట్లుగా మార్చడంలో మేము విఫలమయ్యాము అని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత, పెట్రోల్ ధరల భారం ఓటర్లను డెమోక్రాట్ల వైపు మొగ్గు చూపేలా చేశాయని అభిప్రాయపడ్డారు.