Iran :  ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పజకియాన్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్‌పై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇరాన్‌పై జరిగిన దాడులు, అందులో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల గురించి ఆయన సమావేశంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా మినాబ్‌లోని ఓ పాఠశాలపై జరిగిన దాడిని కూడా ఆయన ప్రస్తావిస్తూ.. మృతిచెందిన బాలికల ఫొటోలను ప్రదర్శించారు. ఈ దాడిలో 120 మంది చిన్నారులతో సహా మొత్తం 156 మంది మరణించారని పజకియాన్ తెలిపారు. అమాయక చిన్నారులను అమెరికా, ఇజ్రాయెల్ చంపేశాయని ఆయన ఆరోపించారు. స్పోర్ట్స్ హబ్‌లో ఆడుకుంటున్న వారిపైనా దాడులు జరిగాయని అన్నారు.

తమ దేశం ఎవరిపైనా దాడి చేయాలని కోరుకోవడం లేదని పజకియాన్ చెప్పారు. ఇరాన్ కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే ప్రతిస్పందించిందని అన్నారు. తమ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ముద్ర వేయడం సరికాదని, తాము ఉగ్రవాదులం కాదని.. ఉగ్రవాదానికి బాధితులమని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ పాఠశాలలు, ఆసుపత్రులు, మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పజకియాన్ అన్నారు. ఎలాంటి చట్టపరమైన కారణం లేకుండా తమ సర్వోన్నత నాయకుడు అయేతుల్లా ఖమేనీని హతమార్చారని ఆయన ఆరోపించారు.

అమెరికా, ఇజ్రాయెల్‌ నుంచి అత్యాధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానంతో దాడులు ఎదురైన తర్వాత తమ దేశం అత్యంత శక్తితో ఆత్మరక్షణ చేసుకుందని పజకియాన్ తెలిపారు. తమ దేశంపై జరిగిన దాడులు, దురాక్రమణలకు అమాయక ప్రజలు లక్ష్యంగా మారారని అన్నారు. తమ దేశాన్ని కాపాడుకోవడానికి ఎవరి అనుమతి అవసరం లేదనిస్పష్టం చేశారు. ఇరాన్ ఎవరిపైనా దాడి చేయాలని కోరుకోవడం లేదని, అయితే తమ దేశ రక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. గత 200 ఏళ్లుగా ఇరాన్ ఎవరిపైనా దాడి చేయలేదని పజకియాన్ వెల్లడించారు. అయినప్పటికీ ప్రస్తుతం ఈ ప్రాంతంలో అస్థిరతకు ఇరాన్‌నే కారణమంటూ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తమను ఉగ్రవాదులుగా ముద్ర వేస్తున్నారని విమర్శించారు.

ఇరాన్‌కు ఆయుధ శక్తి కావాల్సింది సమాజాలను బెదిరించడానికి కాదని, దేశ పురోగతి కోసం మాత్రమే అని పజకియాన్ చెప్పారు. తమ నగరాలపై బాంబు దాడులు జరిగినప్పుడు ఇరాన్ నుంచి ప్రతిస్పందన ఉండదని ఎవరూ భావించకుండా తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేశామని ఆయన తెలిపారు.

మసూద్ పజ్దాకియన్ తన ప్రసంగాన్ని ప్రారంభించగానే, అమెరికా ప్రతినిధి బృందానికి చెందిన ఒక అధికారి తన సీటులోంచి లేచి సమావేశం నుండి బయటకు వెళ్లిపోయాడు. తన కళ్లజోడు తీసివేసి, తన బ్యాగ్‌ను తీసుకుని అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.