
California : అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. సాల్టన్ సిటీలో సోమవారం ఈ ప్రమాదం సంభవించింది.
ఈ దుర్ఘటనలో 45 సంవత్సరాల నజియా సల్మా, ఆమె 19 సంవత్సరాల కుమార్తె హఫీజా నేహా షేక్, 14 సంవత్సరాల కుమారుడు హఫీజ్ ఒమర్ అక్కడికక్కడే మృతి చెందారు. నజియా సల్మా భర్త షేక్ అబ్దుల్ నవీద్ గత పదేళ్లుగా హైదరాబాద్లోని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లో సైంటిస్టుగా పనిచేశారు. ఈ ప్రమాదం నుంచి షేక్ అబ్దుల్ నవీద్తో పాటు వారి ఏడేళ్ల చిన్న కుమార్తె ఖతిజా షేక్ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం తండ్రీకూతుళ్లిద్దరూ కాలిఫోర్నియాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ విషాద వార్త హైదరాబాద్కు చేరడంతో మృతుల స్వస్థలమైన సయీదాబాద్ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు, స్థానికులు భారీ సంఖ్యలో వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన వారి అంత్యక్రియలను విదేశాలలోనే ఈ నెల 24న నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.









