భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలు అక్రమ వలసదారులకు అడ్డాగా మారుతున్నాయి. రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దులోని భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని బంగ్లాదేశీయులు పెద్ద ఎత్తున భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఐదుగురు బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసి విచారించడంతో ఈ అక్రమ వలసదారుల విషయం వెలుగులోకి వచ్చింది.

భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య సుమారు 4,096 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఇది పశ్చిమ బెంగాల్, అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాల గుండా సాగుతుంది. అయితే ఇందులో పశ్చిమ బెంగాల్‌లోని 28 కిలోమీటర్లు, అసోంలోని 25 కిలోమీటర్లు మొత్తం 53 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం మాత్రమే అక్రమంగా దేశంలోకి చొరబడడానికి అనుకూలంగా ఉంది. భారత్‌లోకి రావాలనుకునే వారు మొదట బంగ్లాదేశ్‌లోని జషోర్ జిల్లాకు చేరుకుంటారు. అక్కడి నుండి పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాలు, మాల్దా జిల్లాలు లేదా అసోంలోని ధుబ్రి జిల్లాలో ఉన్న బ్రహ్మపుత్ర నది పరీవాహక ప్రాంతాల ద్వారా భారత్‌లోకి వస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని నదియా, ముర్షిదాబాద్, కూచ్‌బెహార్ జిల్లాలతో పాటు సుందర్‌బన్స్ నదీ మార్గాలు, అసోంలోని కరీమ్‌గంజ్, మాంకాచర్ జిల్లాల పరిసరాలు అక్రమ వలసలకు ప్రధాన మార్గాలుగా మారాయి. ఈ ప్రాంతాల్లో సరిహద్దులకు ఆనుకుని వ్యవసాయ భూములు, నదులు, దట్టమైన గ్రామాలు ఉన్నాయి. ఎన్నో చోట్ల సరైన కంచె, గస్తీ లేకపోవడం వల్ల ఈజీగా ఇండియాలోకి చొరబడుతున్నారు. వీరంతా రాత్రి వేళల్లో చిన్న చిన్న పడవల ద్వారా నదులను దాటుతూ, పంట పొలాల గుండా ప్రయాణిస్తూ ఎవరికీ దొరకకుండా భారత్‌లోకి వచ్చేస్తున్నారు.

ఇలా అక్రమంగా దేశంలోకి వచ్చే బంగ్లాదేశీయులకు స్థానిక ముఠాలు సపోర్ట్ చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా కేంద్రంగా పనిచేసే కొన్ని ముఠాలు వలసదారులకు నకిలీ గుర్తింపు కార్డులను ఇస్తున్నాయి. మరి కొందరు ఇక్కడే చదువుకున్నట్లు నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లను కూడా విక్రయిస్తున్నారు. ఈ నకిలీ పత్రాల సాయంతో వారు ఇండియన్స్‌గా చలామణి అవుతున్నారు. అయితే ఇలా వచ్చే వారిలో మహిళలు, యువతులు వ్యభిచారంలోకి వెళ్తున్నారు. పురుషులు, యువకులను నగరాల్లో దినసరి కూలీలుగా, నిర్మాణ రంగ కార్మికులుగా ఉంటున్నారు. వెంటనే అధికారులు జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకుంటే అక్రమ వలసదారులు ప్రవేశించే అవకాశాలు తగ్గుతాయి.