
Trump Iran Doha Talks : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చర్చల పునరుద్ధరణ అంశం అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఖతార్ రాజధాని దోహా వేదికగా మంగళవారం ఇరు దేశాల ప్రతినిధుల మధ్య కీలక సమావేశం జరగనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ స్వయంగా ఈ తాజా చర్చల కోసం అభ్యర్థించిందని ఆయన తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా వెల్లడించారు. ఈ భేటీలో అమెరికా తరఫున కీలక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్‌లు పాల్గొంటారని శ్వేతసౌధం (వైట్ హౌస్) ధ్రువీకరించింది. వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య తాత్కాలిక ఒప్పంద నిబంధనలపై మంగళవారం చర్చలు పునఃప్రారంభమవుతాయని మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ కూడా ప్రకటించడం దీనికి బలం చేకూర్చింది.
అయితే, ట్రంప్ ప్రకటనకు భిన్నంగా ఇరాన్ విదేశాంగ శాఖ ఈ భేటీని తోసిపుచ్చడం గందరగోళానికి దారితీసింది. ఈ వారం అమెరికాతో ఎలాంటి సాంకేతిక స్థాయి సమావేశాలు లేదా వర్కింగ్ గ్రూపుల భేటీలు షెడ్యూల్ కాలేదని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాదీ స్పష్టం చేశారు. అవతలి పక్షంతో సాధారణ సంప్రదింపులు యథాతథంగా కొనసాగుతున్నప్పటికీ, దోహా భేటీ ఇంకా ఖరారు కాలేదని ఆయన ప్రభుత్వ టెలివిజన్ వేదికగా పేర్కొన్నారు. ఇరు దేశాలు పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేయడంతో దోహా వేదికగా మంగళవారం చర్చలు నిజంగానే జరుగుతాయా లేదా అన్నది ప్రస్తుతం మిస్టరీగా మారింది. అయినప్పటికీ, సోమవారం ఇరు దేశాలూ ఎలాంటి పరస్పర దాడులకు దిగకపోవడం గల్ఫ్ ప్రాంతంలో స్వల్ప ఉపశమనాన్ని కలిగించింది.
ఈ చర్చలు గనుక జరిగితే, అందులో వ్యూహాత్మక ‘హార్ముజ్ జలసంధి’ వివాదమే ప్రధానాంశంగా మారనుంది. ప్రపంచ చమురు, ద్రవీభవన సహజవాయువు (LNG) సరఫరాలో దాదాపు 20 శాతం వాటా ఈ సముద్ర మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన తీవ్రమైన సైనిక దాడుల అనంతరం పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అమెరికా మీడియా సంస్థలైన ‘ఆక్సియోస్’, ‘సీఎన్‌ఎన్’ కథనాల ప్రకారం.. ఈ భేటీలో హార్ముజ్ జలసంధిపై నియంత్రణ, నౌకాయాన రక్షణకు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరగనున్నాయి.
Also Read : బుర్రపాడు మావా: 1,000cc సామర్థ్యం.. 8 సిలిండర్లతో కొత్త బైక్.. ధర మామూలుగా లేదు..!
హార్ముజ్ జలసంధిలో నౌకాయానంపై తమకే పూర్తి నియంత్రణ ఉండాలని ఇరాన్ గట్టిగా పట్టుబడుతోంది. తాము సూచించిన అంతర్జాతీయ సముద్ర మార్గాలను వదిలి ఇతర మార్గాల్లో నౌకలు ప్రయాణిస్తే గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ హెచ్చరించారు. ఇరాన్ అమలు చేస్తున్న భద్రతా విధానాలకు భిన్నంగా అమెరికా కొత్త ఏర్పాట్లు చేయాలని చూస్తే పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతాయని, ఇది హార్ముజ్ జలసంధిని పూర్తిస్థాయిలో తెరవడంలో ఆలస్యానికి దారితీయడమే కాక ప్రాంతీయ అస్థిరతను పెంచుతుందని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, యుద్ధ ముగింపునకు అమెరికాతో కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని ఇరాన్ ప్రజలకు దక్కిన గొప్ప విజయంగా ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అభివర్ణించారు. అమెరికా ఆంక్షల కారణంగా ఖతార్‌లో జప్తు చేసిన ఇరాన్ ఆస్తులలో 600 కోట్ల డాలర్ల (6 బిలియన్ డాలర్లు) విడుదలకు అంగీకారం కుదిరిందని ఆయన వెల్లడించారు. ఖతార్‌లో నిల్వ ఉన్న మొత్తం 1,200 కోట్ల డాలర్ల ఇరాన్ నిధుల్లో.. ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం తొలి విడతగా సగం సొమ్ము విడుదల కానుందని ప్రభుత్వరంగ వార్తాసంస్థ ‘ఐఆర్‌ఎన్‌ఏ’తో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు. ఈ నిధుల విడుదల ప్రక్రియలో ఖతార్, పాకిస్థాన్‌లు కీలక మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి.
ఇదిలావుండగా, అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత్ తరఫున ఉన్నత స్థాయి ప్రతినిధులు హాజరుకానున్నారు. జూలై 5 నుంచి 9 వరకు జరగనున్న ఈ అంత్యక్రియల కార్యక్రమాలకు భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గెరిటా, బిహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ హాజరవుతారని ఇరాన్ వర్గాలు తెలిపాయి. దీనిపై భారత కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ ట్రంప్ ప్రకటించినట్లు దోహా సమావేశం విజయవంతమైతే గల్ఫ్ ప్రాంతంలో శాంతి నెలకొంటుందని, లేనిపక్షంలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగుతాయని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read : షాకింగ్ వీడియో: హర్మూజ్ జలసంధిలో కూలిన హెలికాఫ్టర్.. 14 మంది దుర్మరణం!









