Donald Trump
Donald Trump

Russia Sanctions Bill : అగ్రరాజ్యం అమెరికా ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది. ప్రపంచానికి ఇంకా తానే పెద్దన్న పాత్ర పోషించాలనుకుంటోంది. ఈ క్రమంలో తనతో శత్రుత్వ ఉన్న దేశాలతో స్నేహం చేసే దేశాలపై ఆంక్షలు విధించేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. చివరికి తన మిత్రదేశమైనా, శత్రుదేశంతో వ్యాపారం చేయకూడదనే కఠిన నిర్ణయాన్ని అమలు చేస్తోంది. తాను చేస్తే ధర్మ రక్షణ, ఇతర దేశాలు చేస్తే యుద్ధ నేరంగా ఆ దేశం ఆరోపిస్తోంది. తను ఇరాన్ పై చేస్తున్న దాడులను సమర్థించుకుంటున్న అమెరికా, అదే సమయంలో ఉక్రెయిన్‌ పై దాడులు చేస్తున్న రష్యాను మాత్రం ఆక్షేపిస్తోంది. ఈ క్రమంలోనే రష్యాపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. అంతేకాదు. ఆ దేశంతో సంబంధం కొనసాగిస్తున్న ఇరాన్, చైనా, భారత్‌లను కూడా ఒకేసారి దెబ్బతీసేందుకు అమెరికా సిద్ధమైంది.

ఉక్రెయిన్‌ పై దాడులు చేస్తుందన్న కారణంతో రష్యా, అణు పదార్థాలు ఉన్నాయన్న నేపంతో ఇరాన్‌లపై ఆంక్షలను విధించడమే కాకుండా , ఆ దేశాలతో వాణిజ్యం నెరపుతున్న భారత్, చైనాలపై సుంకాల మోత మోగించేందుకు అధ్యక్షుడు ట్రంప్‌నకు అధికారమిచ్చే బిల్లును ప్రతినిధుల సభ ఆమోదించడం సంచలనంగా మారింది. భారత్‌, చైనా తదితర దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే ‘లిండ్సే ఓ గ్రాహమ్‌ రష్యా, ఇరాన్‌ ఆంక్షల బిల్లు 2026’ను అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. ప్రతినిధుల సభలో జరిగిన ఓటింగ్‌లో 262 మంది అనుకూలంగా, 159 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. కాగా, అనుకూలంగా ఓటేసిన వారిలో 203 మంది రిపబ్లికన్లతోపాటు 58 మంది ప్రతిపక్ష డెమొక్రాట్‌ సభ్యులు కూడా ఉండడం గమనార్హం. ఈ బిల్లుకు ట్రంప్‌నకు బలమైన మద్దతుదారుగా ఉండే లిండ్సే గ్రాహం పేరును పెట్టారు. సౌత్‌ కరోలినా నుంచి ఆయన చట్టసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే గ్రాహం జులైలో మరణించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆయన ఏడాదిపాటు ఈ బిల్లు కోసం మద్దతు కూడగట్టడం లో కీలక పాత్ర పోషించారు.

రష్యాపై ఆంక్షల నేపథ్యంలో భారత్, చైనాలపై అమెరికా 100 శాతం ప్రతీకార సుంకాలను విధించే అవకాశముందన్న ఆందోళన సర్వత్రా ఉంది. అంటే ఈ బిల్లు ద్వారా రష్యా నుంచి చమురు, గ్యాస్‌ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం పన్నులు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి కట్టబెట్టినట్లయింది. అంటే రష్యాతో వాణిజ్యం చేసే దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై అదనపు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, వెంటనే ఈ సుంకాలు అమల్లోకి వస్తాయా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. అయితే భారత్‌-అమెరికా మధ్య తొలిదశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే.. ఈ ఆంక్షల ముప్పు తొలగిపోయే అవకాశం ఉంటుందని ఇండియా ఆశాభావంతో ఉంది. కాగా, ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్‌, చైనా గట్టిగానే స్పందించాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఈ నెలాఖరులో అమెరికాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ బిల్లుకు ఆమోదం లభించడం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా రష్యాపై ఆంక్షలను, తమపై సుంకాలను విధిస్తే అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలకు ముప్పు తప్పదని భారత్‌ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది.

Also Read : నేడు మోదీ బర్త్‌డే .. ఆయన పేరుతో ఉన్న కీలక రికార్డులివే!

భారత్‌, చైనా కీలక వ్యాఖ్యలు

అమెరికా తెచ్చిన బిల్లును అక్కడి ప్రతినిధుల సభ ఆమోదించిన నేపథ్యంలో భారత్‌ కీలక వ్యాఖ్యలు చేసింది.140 కోట్ల ప్రజల ఇంధన భద్రత తమకు ముఖ్యమని.. తన వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలను భారత్‌ తీసుకుంటుందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ పన్నుల భారంపై ఇటీవల అమెరికా ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపామని భారత విదేశాంగ శాఖ వివరించింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపైనే కాకుండా, అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పైనా ప్రభావం చూపే అవకాశం ఉందని భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువోజియాకున్‌ కూడా ఈ విషయమై స్పందిస్తూ.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదం లేని ఏ చర్యను అయినా చైనా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ‘సమానత్వం, పరస్పర ప్రయోజనాల ప్రాతిపదికన చైనా ఇతర దేశాలతో ఆర్థిక, వాణిజ్య సహకారం కొనసాగిస్తుంది’ అని తెలిపారు.

Also Read : భారత్‌పై 100 శాతం టారిఫ్‌ల బిల్లు.. ఓటు వేసేందుకు సిద్ధమైన యూఎస్ హౌస్..!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.