
ఎప్పుడూ చలితో గడ్డకట్టుకుపోయే యూరప్ ఖండం ఇప్పుడు హీట్ వేవ్‌తో నిప్పుల కుంపటిలా మారిపోయింది. ఎండల తీవ్రత తట్టుకోలేక వేల సంఖ్యలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ ఎండలకు అక్కడి రోడ్లపై ఉన్న తారు కరిగి నీరైపోతోంది. వాహనాలు రోడ్డెక్కితే చాలు.. కరిగిన డాంబర్ చక్రాలకు ముద్దలు ముద్దలుగా అంటుకుపోతుండటంతో జనం బయటకు వెహికల్స్ తీయడానికి కూడా భయపడుతున్నారు. అయితే అక్కడ నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రత కేవలం 40 డిగ్రీల సెల్సియస్ మాత్రమే. మరి మన దేశంలో 45 డిగ్రీలు దాటినా కూడా రోడ్లు కరిగిపోకుండా అలాగే ఉంటాయి. దీని వెనుక ఉన్న కారణం ఏంటంటే?
ఏ దేశంలోనైనా రోడ్లను అక్కడి స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా నిర్మిస్తారు. యూరప్‌లో ఎక్కువ భాగం తీవ్రమైన చలికాలం ఉంటుంది. మంచు కురుస్తూ ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి పడిపోతుంటాయి. ఆ చలికి రోడ్లు గట్టిపడి పగుళ్లు రాకుండా ఉండటం కోసం అక్కడి ఇంజనీర్లు సాఫ్ట్ గ్రేడ్ బిటుమెన్ అనే ఒక మెత్తటి రకం తారును ఉపయోగిస్తారు. ఈ సాఫ్ట్ బిటుమెన్‌కు చల్లని వాతావరణంలో సాగే గుణం ఉంటుంది. దీనివల్ల ఎంత చలి ఉన్నా కూడా రోడ్లు పగలకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. అయితే ఇప్పుడు వాతావరణంలో మార్పులు రావడం వల్ల యూరప్‌లో ఎండలు పెరిగాయి. చలిని తట్టుకోవడానికి వాడిన ఆ సాఫ్ట్ తారు.. వేడి ఎక్కువ కావడంతో వ్యతిరేకంగా మారుతుంది.
ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటగానే ఆ బిటుమెన్ పూర్తిగా మెత్తగా అవుతుంది. దానిపై భారీ వాహనాలు వెళ్లినప్పుడు రోడ్లు కుంగిపోవడం, తారు కరిగి చక్రాలకు అంటుకోవడం వంటివి జరుగుతాయి. అదే యూరప్‌తో పోల్చితే ఇండియాలో వాతావరణం డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి ఇక్కడి ఇంజనీర్లు ముందు చూపుతో VG-30, VG-40 వంటి అత్యంత గట్టి వోలాటిలిటీ గ్రేడ్ బిటుమెన్‌ను వాడుతారు. దీనికి పెద్ద పెద్ద కంకర రాళ్లను కలిపి రోడ్లు వేస్తారు. ఈ గట్టి తారు ఎంతటి తీవ్రమైన ఎండలనైనా, వడగాల్పులనైనా తట్టుకుంటుంది. ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ దాటినా కూడా ఇది మెత్తబడదు. అలాగే భారీ ట్రాఫిక్ భారాన్ని కూడా తట్టుకుని రోడ్లు గుంతలు పడకుండా కాపాడుతుంది. అందుకే ఇండియాలో 45 డిగ్రీలు దాటినా రోడ్లు కరిగిపోకుండా ఉంటాయి.









