ఢిల్లీలో భారీ ఉగ్రదాడి కుట్రను స్పెషల్ సెల్ పోలీసులు చాకచక్యంగా భగ్నం చేశారు. ఎంతో భద్రంగా ఉండే ఢిల్లీలో అల్లర్లు సృష్టించేందుకు.. ముఖ్యమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నిఘా వర్గాల నుంచి ముందస్తు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఈ కుట్రను భగ్నం చేశారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు విజయవంతంగా అరెస్ట్ చేశారు. అయితే కుట్ర వెనుక పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) హస్తం ఉన్నట్లు విచారణలో తేలింది. పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ హ్యాండ్లర్ షెహజాద్ భట్టి ఈ దాడులకు సంబంధించిన పూర్తి ప్రణాళికను రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. షెహజాద్ భట్టి పాకిస్తాన్ నుంచి ఫోన్లు, సోషల్ మీడియా నెట్‌వర్క్‌ల ద్వారా భారతదేశంలోని ఈ నిందితులతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ వచ్చినట్లు తెలిపారు. ఢిల్లీలో ఎక్కడెక్కడ దాడులు చేయాలి.. ఏయే ప్రాంతాలను టార్గెట్ చేసుకోవాలి అనే విషయాలపై ఈ నలుగురు నిందితులకు ఎప్పటికప్పుడు అతను దిశానిర్దేశం ఇస్తూ వచ్చాడని పోలీసులు గుర్తించారు.

అరెస్ట్ అయిన ఈ నలుగురిలో ముగ్గురు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, మరొకరు ఢిల్లీకి చెందిన వారిగా గుర్తించారు. పంజాబ్‌కు చెందిన నిందితులు సరిహద్దుల ద్వారా ఆయుధాలను సేకరించడంలో, స్థానిక ముఠాలతో పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఢిల్లీకి చెందిన నిందితుడు స్థానికంగా రవాణా సౌకర్యాలు కల్పించడం, దాడులు చేయాల్సిన ప్రాంతాలను ముందుగానే పరిశీలించి సమాచారాన్ని పాకిస్తాన్ హ్యాండ్లర్‌కు చేరవేయడంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నలుగురు కలిసి ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉగ్రదాడులకు పాల్పడినట్లు భారీ ప్లాన్ వేసినట్లు పోలీసులు గుర్తించారు.

నిందితులను అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసులు వారి నుంచి భారీగా ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి రెండు అత్యాధునిక విదేశీ పిస్టల్స్, 9 లైవ్ బుల్లెట్లు తీసుకున్నారు. లభించాయి. వీటితో పాటు పాకిస్తాన్ హ్యాండ్లర్లతో రహస్యంగా మాట్లాడటానికి ఉపయోగించిన 5 మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ ఫోన్లలో ఉన్న కాల్ డేటా, చాటింగ్ హిస్టరీ, లొకేషన్ల ఆధారంగా పోలీసులు ఇంకా కొన్ని వివరాలను సేకరిస్తున్నారు. ఈ ముఠాకు ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు విచారణ చేస్తున్నారు.