Putin Kyiv ceasefire : సంవత్సరాలుగా సాగుతున్న రష్యా -ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా అడుగులు పడుతున్నాయా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తు్న్నాయి. యుద్ధాన్ని అపేందుకు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై మూడు రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించడం దీనికి బలాన్ని చేకూర్చింది.

రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధాన్ని ముగించేదిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగించేందుకు వీలుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్.. రష్యా, ఉక్రెయిన్ పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో కాల్పుల విరమణ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలను కొంత తగ్గించేందుకు వీలుగా తాత్కాలిక కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శుక్రవారం ప్రతిపాదించారు. అమెరికా ప్రతినిధులు రష్యా, ఉక్రెయిన్‌లతో చర్చలు జరిపే సమయంలో ఉక్రెయిన్ వైపు నుంచి రష్యాపై వైమానిక దాడులు ఉండవని జెలెన్‌స్కీ ప్రకటించారు. అదే సమయంలో రష్యా కూడా కీవ్‌ పై దాడులను నిలిపివేయాలని కోరారు. ఈ తరుణంలో ఇరు దేశాలు కనీసం చర్చలు జరిగేంత వరకు దాడులు ఆపితే.. శాంతి చర్చలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని జెలెస్కీ అభిప్రాయపడ్డారు

ఆయన ప్రకటన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నాడు. కీవ్‌పై మూడు రోజుల పాటు దాడులు నిలిపివేయాలని పుతిన్ ఆదేశించినట్లు క్రెమ్లిన్ ప్రకటించింది. ఈ తాత్కాలిక విరామం శనివారం అర్ధరాత్రి నుంచి మొదలవుతుందని రష్యా తెలిపింది. కాగా, అనేక ఏళ్లగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా మరోసారి చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ మాస్కోలో పర్యటిస్తున్నారు. అక్కడ రష్యా అధికారులతో చర్చించిన అనంతరం కీవ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశం అవుతారు.

రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా వద్ద ఒక కొత్త శాంతి ప్రతిపాదన ఉందని ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. ఇటీవల పుతిన్ కూడా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందానికి అవకాశం ఉందని వెల్లడించారు. అమెరికా, చైనా సహా పలు దేశాలు శాంతి పరిష్కారానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే చివరకు సమస్యను పరిష్కరించాల్సింది మాత్రం రష్యా, ఉక్రెయిన్‌లేనని తేల్చి చెప్పారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.